Saturday, December 29, 2012

తెలుగు ప్రపంచ మహాసభలు (part - II)



తాజా వార్త, తాజా వార్త, రండి బాబు రండి తాజా వార్త, తాజా వార్త ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజు విశేషాలు ........
ఈ రోజంతా అయిపోయాక ఇప్పుడు తాజా వార్తేంటి అంటారా???? అయితే వాకే.

నిన్న వెళ్ళినప్పుడు ప్రముఖుల ప్రసంగాలు తప్ప  ఇంకేమి చూడలేదు కదా, పైగా అప్పటికప్పుడు చెప్పినందువల్ల నేను కెమెరా కూడా పట్టుకెళ్ళలేదు ఫోటోలు తీద్దమంటే....అందుకే ఇవ్వాళ సగం రోజు సెలవు పెట్టేసి, నా కొలీగ్ చేత కూడా బలవంతంగా సెలవు పెట్టించి (కూసే గాడిద వచ్చి  మేసే గాడిదని చేడిపింది అంటారు కదా, అలాగన్నమాట) సభా ప్రాంగణానికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే  భోజనశాలకి వెళ్లి భోజనం చేసాము. ఓ పది రకాల కూరలతో భోజన ఏర్పాట్లు బానే చేసారు.

అక్కడి నుండి ఉపవేదికలకి వెళ్ళాము.  ముందుగ సంగీత వేదిక.  ఇక్కడ మేము వెళ్ళే సమయానికి అన్నమాచర్య గీతాలను ఆలపిస్తూ ఉన్నారు.  చాలా చక్కగా పాడారు. తరువాత ఆ  పక్కనే ఉన్న సాహిత్య వేదికకి వెళ్ళాము. అక్కడ భారతి విద్యా భవన్ స్కూల్ పిల్లలు శ్రీ సూక్తం, కృష్ణ సూక్తం నుండి పద్యాలు చెప్తున్నారు.  అందరు ఆరేళ్ళ లోపు పిల్లలే.  అందరు ధోతి, కండువా కట్టుకుని ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలు. అంతే ఠీవిగా , చాలా అందంగా చెప్తున్నారు పద్యాలను.  అసలు ఎంతసేపైనా అక్కడే ఉండిపోవాలనిపించింది, కానీ చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కదా, అందుకే బయటకు రాక తప్పలేదు.

ఆ పక్కనే నృత్య వేదిక. ఇక్కడ శ్రీమతి దేవులపల్లి ఉమ గారి కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతోంది. రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని, అన్నమాచార్యుల వారు రచించిన "వినరో భాగ్యము విష్ణు కథ" అన్న పాటకు ప్రదర్శించారు.  చాలా చాలా బాగున్నింది. కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శన ముగిసే వరకు చూడటం ఇదే మొదటిసారి.  ఇంత అందంగా ఉంటుందా కూచిపూడి నృత్యం అనిపించింది.

తరువాత రంగస్థల వేదిక.  ఇక్కడ ఏదో నాటకం మధ్యలో ఉంది. పైగా  హాలంతా నిండిపోయి ఉంది. అందుకే వెళ్ళలేదు. అయినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో తిరుపతిలో జాతీయ స్థాయి నాటకోత్సవాలు జరుగుతాయి. అప్పుడు వెళ్లి చూదోచ్చులే అని సర్ది చెప్పుకుని, జానపద వేదికకు వెళ్ళాము.  కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. కనీసం నిల్చుకోడానికి కూడా స్థలం లేదు. సరే అనుకుని బయటకు వస్తుంటే, బయట కొందరు లంబాడి వాళ్ళు డాన్సు చేస్తూ కనిపించారు.  వారి ప్రదర్శన కొద్దిసేపు చూసాము.

ఆ తరువాత ప్రధాన వేదిక పక్కన ఉన్న ప్రదర్సనశాలలకు వెళ్ళాము.  ఇక్కడ ప్రతి స్టాల్ ముందు జనాలు క్యూలు కట్టి ఉన్నారు. అలానే క్యూలలో వెళ్లి అన్ని స్టాల్ల్స్ చూసాము. ఇక్కడ "జోడించు " అని ఒక స్టాల్ ముందు బోర్డు ఉంది.  అది ఇంగ్లీష్ లో scrabble ఆట ఉంది కదా, అలా తెలుగులో అన్నమాట. అలాగే ఇంకొకటి టైమర్ తో ఉంటుంది.  చిన్న పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది.

అన్ని చూసాము కానీ చర్చా వేదికలు ఎక్కడా కనిపించలేదు.  సరే వాళ్ళని వెళ్ళని అడిగి కనుక్కుంటూ చర్చా వేదికల వైపు వెళ్ళాము.  ఆ వేదికలకన్నా కాస్త ముందు పుస్తక ప్రదర్శన శాలలు ఉన్నాయి.  ఎన్ని పుస్తకాలో. అప్పటికే రాత్రి అయినందువల్ల అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. ఓ ఐదు పుస్తకాలు మాత్రం కొనేసి బయటకి వచ్చి చర్చా వేదికల వైపు వెళ్ళాము.  ఇవి మొత్తం ఐదు వేదికలు.  మొదటి రెండు ఖాళీగా ఉన్నాయి.  తరువాత మూడింటిలో వేదిక పైన వక్తలు ఉన్నారు కానీ శ్రోతలు పదిమంది లోపే ఉన్నారు.

ఇంక ఇప్పటికి టైం 7.30 అయిపొయింది.  మధ్యాహ్నం 1.30 నుండి అదే పనిగా మొత్తం తిరుగుతున్నాము కదా, ఇంకా ఓపిక కూడా లేదు అందుకే ఇవ్వాల్టికి చాలు అనుకుని, బయటికి వచ్చేసాము. కానీ ఇంకా మనస్సు ఆ పుస్తక ప్రదర్శన శాలల వద్దే ఉండిపోయింది ఇద్దరికీ. అందుకే రేపు కూడా వద్దాం అని నిర్ణయించుకున్నాం.

(బాబోయ్............ రేపు కూడా ఇలా టపా రాసి చంపేస్తుందా ???????????? అని అనుకుంటున్నారా!!!!!!!!!, మీకా భయం వద్దులెండి, రేపు నేను కేవలం పుస్తకాలు కొనడానికే వెళ్తున్నాను. కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు)

6 comments:

 1. రేపు కొన్న పుస్తకాల గురించి రాయండి. చదువుతాం. :)

  ReplyDelete
  Replies
  1. శిశిర గారు, తప్పకుండా అండి .

   Delete
 2. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చేడిపింది అంటారు కదా, అలాగన్నమాట
  -------------------
  lolz :-)
  రేపు కూడా ఇలా టపా రాసి చంపేస్తుందా ???????????? అని అనుకుంటున్నారా
  -----------------
  మేమేమి అలా అనుకోవటం లేదు గా అందుకని మీరు రాసేయ్యాలి అన్నమాట :-)

  ReplyDelete
  Replies
  1. శ్రావ్య గారు, ఇంక మహాసభల గురించి రాయను కాని, కొన్న పుస్తకాల గురించి రాస్తాను.

   Delete
 3. Konchem raasi inka raayanu ante ela chadivevallu unnaru ikkada

  ReplyDelete
  Replies
  1. Aparna akka, kevalam books matrame konnanu. Vaatigurinchi raasthaanu

   Delete