Saturday, December 29, 2012

తెలుగు ప్రపంచ మహాసభలు (part - II)తాజా వార్త, తాజా వార్త, రండి బాబు రండి తాజా వార్త, తాజా వార్త ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజు విశేషాలు ........
ఈ రోజంతా అయిపోయాక ఇప్పుడు తాజా వార్తేంటి అంటారా???? అయితే వాకే.

నిన్న వెళ్ళినప్పుడు ప్రముఖుల ప్రసంగాలు తప్ప  ఇంకేమి చూడలేదు కదా, పైగా అప్పటికప్పుడు చెప్పినందువల్ల నేను కెమెరా కూడా పట్టుకెళ్ళలేదు ఫోటోలు తీద్దమంటే....అందుకే ఇవ్వాళ సగం రోజు సెలవు పెట్టేసి, నా కొలీగ్ చేత కూడా బలవంతంగా సెలవు పెట్టించి (కూసే గాడిద వచ్చి  మేసే గాడిదని చేడిపింది అంటారు కదా, అలాగన్నమాట) సభా ప్రాంగణానికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే  భోజనశాలకి వెళ్లి భోజనం చేసాము. ఓ పది రకాల కూరలతో భోజన ఏర్పాట్లు బానే చేసారు.

అక్కడి నుండి ఉపవేదికలకి వెళ్ళాము.  ముందుగ సంగీత వేదిక.  ఇక్కడ మేము వెళ్ళే సమయానికి అన్నమాచర్య గీతాలను ఆలపిస్తూ ఉన్నారు.  చాలా చక్కగా పాడారు. తరువాత ఆ  పక్కనే ఉన్న సాహిత్య వేదికకి వెళ్ళాము. అక్కడ భారతి విద్యా భవన్ స్కూల్ పిల్లలు శ్రీ సూక్తం, కృష్ణ సూక్తం నుండి పద్యాలు చెప్తున్నారు.  అందరు ఆరేళ్ళ లోపు పిల్లలే.  అందరు ధోతి, కండువా కట్టుకుని ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలు. అంతే ఠీవిగా , చాలా అందంగా చెప్తున్నారు పద్యాలను.  అసలు ఎంతసేపైనా అక్కడే ఉండిపోవాలనిపించింది, కానీ చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కదా, అందుకే బయటకు రాక తప్పలేదు.

ఆ పక్కనే నృత్య వేదిక. ఇక్కడ శ్రీమతి దేవులపల్లి ఉమ గారి కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతోంది. రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని, అన్నమాచార్యుల వారు రచించిన "వినరో భాగ్యము విష్ణు కథ" అన్న పాటకు ప్రదర్శించారు.  చాలా చాలా బాగున్నింది. కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శన ముగిసే వరకు చూడటం ఇదే మొదటిసారి.  ఇంత అందంగా ఉంటుందా కూచిపూడి నృత్యం అనిపించింది.

తరువాత రంగస్థల వేదిక.  ఇక్కడ ఏదో నాటకం మధ్యలో ఉంది. పైగా  హాలంతా నిండిపోయి ఉంది. అందుకే వెళ్ళలేదు. అయినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో తిరుపతిలో జాతీయ స్థాయి నాటకోత్సవాలు జరుగుతాయి. అప్పుడు వెళ్లి చూదోచ్చులే అని సర్ది చెప్పుకుని, జానపద వేదికకు వెళ్ళాము.  కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. కనీసం నిల్చుకోడానికి కూడా స్థలం లేదు. సరే అనుకుని బయటకు వస్తుంటే, బయట కొందరు లంబాడి వాళ్ళు డాన్సు చేస్తూ కనిపించారు.  వారి ప్రదర్శన కొద్దిసేపు చూసాము.

ఆ తరువాత ప్రధాన వేదిక పక్కన ఉన్న ప్రదర్సనశాలలకు వెళ్ళాము.  ఇక్కడ ప్రతి స్టాల్ ముందు జనాలు క్యూలు కట్టి ఉన్నారు. అలానే క్యూలలో వెళ్లి అన్ని స్టాల్ల్స్ చూసాము. ఇక్కడ "జోడించు " అని ఒక స్టాల్ ముందు బోర్డు ఉంది.  అది ఇంగ్లీష్ లో scrabble ఆట ఉంది కదా, అలా తెలుగులో అన్నమాట. అలాగే ఇంకొకటి టైమర్ తో ఉంటుంది.  చిన్న పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది.

అన్ని చూసాము కానీ చర్చా వేదికలు ఎక్కడా కనిపించలేదు.  సరే వాళ్ళని వెళ్ళని అడిగి కనుక్కుంటూ చర్చా వేదికల వైపు వెళ్ళాము.  ఆ వేదికలకన్నా కాస్త ముందు పుస్తక ప్రదర్శన శాలలు ఉన్నాయి.  ఎన్ని పుస్తకాలో. అప్పటికే రాత్రి అయినందువల్ల అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. ఓ ఐదు పుస్తకాలు మాత్రం కొనేసి బయటకి వచ్చి చర్చా వేదికల వైపు వెళ్ళాము.  ఇవి మొత్తం ఐదు వేదికలు.  మొదటి రెండు ఖాళీగా ఉన్నాయి.  తరువాత మూడింటిలో వేదిక పైన వక్తలు ఉన్నారు కానీ శ్రోతలు పదిమంది లోపే ఉన్నారు.

ఇంక ఇప్పటికి టైం 7.30 అయిపొయింది.  మధ్యాహ్నం 1.30 నుండి అదే పనిగా మొత్తం తిరుగుతున్నాము కదా, ఇంకా ఓపిక కూడా లేదు అందుకే ఇవ్వాల్టికి చాలు అనుకుని, బయటికి వచ్చేసాము. కానీ ఇంకా మనస్సు ఆ పుస్తక ప్రదర్శన శాలల వద్దే ఉండిపోయింది ఇద్దరికీ. అందుకే రేపు కూడా వద్దాం అని నిర్ణయించుకున్నాం.

(బాబోయ్............ రేపు కూడా ఇలా టపా రాసి చంపేస్తుందా ???????????? అని అనుకుంటున్నారా!!!!!!!!!, మీకా భయం వద్దులెండి, రేపు నేను కేవలం పుస్తకాలు కొనడానికే వెళ్తున్నాను. కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు)

Thursday, December 27, 2012

తెలుగు ప్రపంచ మహాసభలు (part -I)తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర ప్రాంగణం లో నాల్గవ తెలుగు ప్రపంచ మహా సభలు ఇవ్వాళ ఉదయం ప్రారంభమయ్యాయి. ఇవ్వాల్టి నుండి మూడు రోజులు ఈ సభలు / ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగు వారు, సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు, తెలుగు భాషకు విశిష్ట సేవలందించిన వారు అందరు విచ్చేశారు.  వీళ్ళందరితో తిరుపతి నగరం కళకళలాడుతోంది. అందరి సౌకర్యార్ధమ్ తిరుపతి లోని అన్ని ప్రాంతాల నుండి వేదిక వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసారు. 

ఇవ్వాళ పొదున్న 7.30 గంటలకు మా ఆఫీసు వాళ్ళందరం (మా ఏముంది లెండి, అన్ని ప్రభుత్వ ఆఫీసులు వాళ్ళు, బడి పిల్లలు, కాలేజి పిల్లలు అందరు ఊరేగింపుగా సభా ప్రాంగణం వరకు నడుచుకుంటూ వెళ్ళాము. పిల్లలందరూ వివిధ వేషధారణలతో ఎంతో ముచ్చటగా ఉన్నారు.  ఇంకా కొందరు మన తెలుగు సంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలు, కోలాటం ఆడుతూ వచ్చారు. కొద్దిగా చిన్న పిల్లలకి వాళ్ళ టీచర్లు ఏవో స్లోగోన్లు రాసిచ్చారు. వెళ్ళు వాటిని పెద్దగ దారంతా  చెప్తూ వచ్చారు. (ఉదా: దేశ భాషలందు తెలుగు లెస్స) మొత్తంగా మూడు కిలోమీటర్లు నడక అయిన ఇవన్ని చూస్తూ అసలు అలుపు తెలియలేదు.

మొత్తానికి సభా ప్రాంగణానికి చేరుకున్నాం.  ప్రాంగణమంత పెద్దలతో పిల్లలతో కిటకిటలాడుతోంది. మేము వెళ్లేసరికి డా.అక్కినేని నాగేశ్వర రావు గారు మాట్లాడుతున్నారు. ఆ తరువాత మాగుంట సుబ్బరామి రెడ్డి గారు, వట్టి వసంత కుమార్ గారు మాట్లాడారు.  

అటు తరువాత డా. పి.సుశీల గారు, శ్రీమతి రావు బాల సరస్వతి గారు వందేమాతరం, మా తెలుగు తల్లికి గీతాలను ఆలపించారు.  ఎన్నో పాటలు ఎంతో మధురంగా పాడిన సుశీల గారు, ఎందుకో ఇవ్వాళ మన రాష్ట్ర గీతమైన "మా తెలుగు తల్లికి " పాటను పాడటం లో ఫెయిల్ అయ్యారు అని అనిపించింది.  నాకు ఆ పాడిన తీరు నచ్చలేదు. (ఇది నా అభిప్రాయం మాత్రమే)

తరువాత మన ముఖ్య మంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి గారు, గవర్నర్ నరసింహన్ గారు మాట్లాడారు. ముఖ్య మంత్రి గారి ప్రసంగం ఎప్పటిలా కాకుండా చాలా బాగుంది అనే చెప్పొచ్చు.  అక్కడక్కడ కొన్ని విభక్తి దోషాలు దొర్లిన కూడా చాలా చక్కగా మాట్లాడారు.  గవర్నర్ గారు కూడా తెలుగు లోనే మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి గారు జ్యోతి ప్రజ్వలనం చేసిన తరువాత ఈ సభల కోసం ప్రత్యేకించి డా.సి. నారాయణ రెడ్డి గారు రాసిన పాటను బాలు గారు పాడాల్సి ఉంది కానీ ఆయనకీ ఆరోగ్యం సరిలేని కారణం గా దాని రికార్డు ప్లే చేసారు.పాట  మాత్రం చాలా చాలా బాగుంది.  " మా తెలుగు తల్లికి జేజేలు , ఆ వెలుగు వెల్లువకు జోహారు" అని మొదలవుతుంది ఈ పాట.  కోటి గారు స్వరపరచిన ఈ పాటని బాలు గారు ఎంతో ఎనేర్జిటిక్ గా పాడారు.  ఇంకా దేశ విదేశాల్లో ఉన్నత శిఖరాలని అధిరోహించిన కొందరు తెలుగు వారిని సన్మానించారు.  వీరిలో మన బాపు గారు కూడా ఉన్నారు.

ఇంక అప్పటికే నాకు ఆఫీసు నుండి ఫోన్ రావడం తో మళ్లీ రేపో ఎల్లుండో వద్దాం అని బయటకి వచ్చేసాం.

అన్నట్టు ఈ సభలకు ప్రత్యేక ఆకర్షణ గా "అక్షర కల్పవృక్షం" ఏర్పాటు చేసారు.  ప్రధాన వేదిక కాకుండా, సాహితి వేదిక, జానపద వేదిక అని మరో ఐదు ఉపవేదికలు, నాలుగు చర్చా వేదికలు ఏర్పాటు చేసారు.  ఇంకా వివిధ ప్రదర్సనశాలలు  కూడా ఉన్నాయి. ఇంకా చలన చిత్రాల ప్రదర్శనకు రెండు సినిమా హాళ్ళు ఎంపిక చేసారు.  స్థానిక మహతి కళాక్షేత్రం లో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులే.

Wednesday, December 26, 2012

ఏం చెప్పాలి.............???????????


ఈ పిల్లలున్నారే .......................!! ఒక్కోసారి తెగ ముద్దోచ్చేస్తారు. వాళ్ళ మాటలు ఎంత ముద్దుగా  ఉండి మురిపిస్తాయో , ఇంకోసారి అంతే విసిగించేస్తారు.  చిన్నప్పుడు ఆ వచ్చీ రాని మాటలు వింటుంటే ఎంతో అబ్బుర పడిపోయి మళ్లీ మళ్లీ వినాలి అని తెగ ముచ్చట పడిపోతూఉంటాము .  కానీ వాళ్ళు పెద్దయ్యేకొద్దీ వారి మాటలు కొన్నిసార్లు చాలా ఆందోళన కలిగిస్తాయి. భవిష్యత్తులో వీరేమైపోతారా అన్న దిగులు కూడా పుడుతుంది.

అదంతా సరేకానీ ఈ సోదంతా మాకెందుకు  చెప్తున్నావు?????????????? అని అనుకుంటున్నారా .............??
వస్తున్నా , వస్తున్నా అక్కడికే వస్తున్నా...

ఏమీ లేదండీ, నా అదృష్టం పుచ్చిపోయి, నక్కని, పిల్లిని, కుక్కని అన్నింటిని ఏకకాలం లో తోక్కేసానేమో (???!!!!) నిన్న ఆఫీసులో పని కాస్త తక్కువగా ఉండటం వల్ల సాయంత్రం 3.30కే ఆఫీసు నుండి బయట పడ్డాను.  ఓ మూడు నెలల తరువాత అనుకుంటా ఇలా వెలుతురు ఉండగానే ఆఫీసు నుండి బయటకు రావడం.


 ఇంటికి వచ్చీ రాగానే పక్కింట్లో పిల్లలు, మిద్దె మీది పిల్లలు అందరు ఆంటీ నువ్వు ఈ రోజు త్వరగా వచ్చేసావుగా అయితే మాతో ఆడుకోవాలి ఇవ్వాళ అని మొదలెట్టారు. ఒకటి నుండి పది క్లాసుల మధ్యలో ఓ ఐదు మంది పిల్లలు వీళ్ళు. సరే అయితే ముందు మనం కాసేపు చదువుకుందాం తరువాత ఆడుకుందాం అని చెప్పి నాలోని ఒక టీచర్ ని , ఒక మెంటర్ ని, అందరిని మేల్కొలిపే ప్రయత్నం చేసాను.

4th class పిల్లతో ముచ్చట్లు:

 "ఇది ఏంటి?"   మావిడి చెట్టు.
 మరి దీని పండ్ల పేరేంటి?  "మామిడి పండ్లు"  ఓ గుడ్ మరైతే ఇప్పుడు చెప్పు, మామిడి పండ్లు ఏ చెట్టుకి కాస్తాయి?
"ఏమో తెలియదు ఆంటీ"  అదేంటే ఇప్పుడేగా చెప్పావు, మామిడి చెట్టుకి మామిడి పండ్లు వస్తాయి అని, మరి మామిడి పండ్లు ఏ చెట్టుకి కాస్తాయి అంటే తెలియదు అంటావే?
"మామిడి చెట్టుకి మామిడి పండ్లు కాస్తాయి అని మా టీచర్ చెప్పింది ఆంటీ, కానీ మామిడి పండ్లు ఏ  చెట్టుకి వస్తాయో చెప్పలేదు "

ఒక్కసారి గా మైండ్ బ్లాక్ అవ్వడం అంటే ఏంటో అప్పుడు తెలిసింది. నా పక్కనే ఉన్న ఆ పిల్ల తల్లి "స్వాతీ .... దీన్ని ఇంకేమి అడక్కు, దీని నెత్తిన నేను  పెట్టిన యాభై వేలు గిర్రున తిరుగుతున్నాయి. దీని నోటినుండి ఇంకేమి వినాల్సి వస్తుందో అన్న టెన్షన్ కే నాకు కళ్ళు తిరుగుతున్నాయి" అంది.

9th class పిల్లతో ముచ్చట్లు:

ఏ శ్రావ్య, నువ్వు చెప్పు, నీకు లెటర్ రైటింగ్ ఉంది కదా? "ఆ ఉంది అక్కా" అయతే చెప్పు, PIN అంటే ఏంటి? "లెటర్ రైటింగ్ లో PIN ఏంటి అక్కా?"  సరే అయితే మన ఇంటి పోస్టల్ అడ్రస్ చెప్పు. "...........,............, .........., -01"  హ్మ్మ్ ఇప్పుడు 01 అన్నావు కదా ఆ  నెంబర్ ఏంటి? "అంటే అక్క, ప్రతి అడ్రస్ తరువాత అలా ఒక నెంబర్ రాయాలి. కాని అది ఎందుకో తెలియదు"
PIN అంటే Postal Index Number.  టెక్స్ట్ బుక్స్ కి ఫస్ట్ లో ఇస్తారు కదా ఒక్కో చాప్టర్ ని, లెసెన్ ని గుర్తు పట్టడానికి ఇండెక్స్, అలా పోస్టల్ డిపార్టుమెంటు వాళ్ళు మనం రాసిన అడ్రస్ సులభం గా గుర్తు పట్టడానికి, ఒక్కో ఊరికి, ఒక్కో PIN అలాట్ చేసారన్నమాట.
"మాకు ఇవేమీ చెప్పలేదక్కా మా టీచరు"  పోనిలే అయితే ఒక లెటర్ ని ఎన్ని విధాలుగా పంపవచ్చు?
"అంటే అక్కా మాకు లెటర్ రైటింగ్ ఒక్కటే చెప్పరక్కా, అది ఎలా పోస్ట్ చేయాలో చెప్పలేదు".
వాళ్ళు చెప్పకపోయినా నువ్వు తెలుసుకోవాలి కదా. రేపు నీకు జాబ్ వచ్చిన తరువాత ఇలా లెటర్ పంపడం రాదు అంటే ఎలా?
"జాబ్ జాయిన్ అయ్యాక నేను ఓన్లీ లెటర్ రాస్తాను అంతే కాదక్కా, పోస్ట్ చేయడానికి ఆఫీసు బాయ్ ఉంటాడు గా?"

వారెవ్వా వాట్ ఎన్ ఆన్సర్ సర్జీ అనుకుని, నా చిన్నప్పుడు నాకింత తెలివి లేదే అని నన్ను నేనే తిట్టేసుకుంటూ నేనెంత అజ్ఞానం లో ఉన్నానో తెలుసుకుంటున్న తరుణం లో వచ్చింది ఇంకో ఇంట్లోని U.K.G చదివే పిల్లది. అది రావడం తోనే,

"ఆంటీ ఆంటీ, మేము ఇవ్వాళ లైఫ్ గేమ్ ఆడాము తెలుసా?"  ఓహ్ అవునా గుడ్.
"తెలుసా ఆంటీ, నాకేమో ఫస్ట్ ఎంగేజ్మెంట్ అని వచ్చింది, తరువాత మ్యారేజ్ ఆ తరువాత 3 చిల్ద్రెన్"
ఓహ్ గుడ్.
"ఈ అక్కకేమో ఎంగేజ్మెంట్ అవ్వకుండానే మ్యారేజ్ వచ్చింది డైరెక్ట్ గా" ఓహ్ అవునా.
"మరేమో శ్రావ్య అక్కకి ఎంగేజ్మెంట్ కాలేదు, మ్యారేజ్ లేదు, ట్విన్స్ వచ్చారు ఆంటీ" గుడ్ కదా.
"అది కాదాంటి ఎంగేజ్మెంట్, మ్యారేజ్ రాకుండానే ట్విన్స్ ఆంటీ"  చెప్పావు కాదే ఇప్పుడే, మళ్ళి చెప్తావే?
"అది కాదాంటి, ఎంగేజ్మెంట్ అవ్వక పోయినా పర్లేదు కానీ మ్యారేజ్ అవ్వకుండానే పిల్లలు పుట్టారు అంటే తప్పు కదాంటి" అంది పక్కన పిల్లని చూసి ముసిముసి గా నవ్వుతూ

మై గాడ్ ........................ ఏంటిది? నేను వింటున్న మాటలు !!!!!!!!!!!!!!!! అంత చిన్న పిల్ల .......
ఎవరు నేర్పిస్తున్నారు వీళ్ళకి ఈ మాటలు?  అసలు తప్పొప్పులు అంటే ఏంటో తెలిసే వయసేన అది?  అసలేమనుకోవాలి వీళ్ళని? ఎటు పోతున్నాయి వీళ్ళ ఆలోచనలు? ముందు చెప్పిన ఇద్దరు పిల్లల్ని చూసి వీళ్ళు అమాయకులు అనుకోవాలా? లేక తరువాతి పిల్లని చూసి ముదుర్లు అనుకోవాలా?

ఎందుకో మనస్సంత కేలికినట్టు ఏదో తెలియని బాధ. ఏమిటి ఈ పిల్లల భవిష్యత్తు?


Wednesday, November 28, 2012

దైవం మానుష రూపేణ (Part - I)

దేవుడు!......నిత్యం మనమందరం ఎదో ఒక సందర్భంలో ఎదో ఓక రూపంలో ఈయన్ను తలచుకుంటూ ఉంటాము. రాముడు, కృష్ణుడు, అల్లా, జీసస్, బుద్ధుడు.....ఎవరు ఏ పేరుతో పిలిచినా, ఏ విధంగా పూజించినా, పూర్తి విశ్వాసం ఉంచాలే కాని, ఎల్లవేళలా మనతోనే ఉండి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు.   కాని మనమే తన ఉనికిని గుర్తించలేకపోతున్నాము.  నాకు అనుభవమైన కొన్ని సందర్భాలని ఇక్కడ మీతో పంచుకోవాలని ఈ టపా రాస్తున్నాను.

ఆ వ్యక్తి ఎవరు?

2004 November, 8వ తారీఖు - భారీ వర్షాల కారణంగా రైళ్లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఒక ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూ నిమిత్తం కేరళలోని తిరువనంతపురం వెళ్ళిన నేను మా నాన్న, ఇక వేరే దారి లేక బస్సులు మారి ఊరు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాము.  బస్టాండ్కి వెళ్లేసరికి అదృష్టం కొద్ది డైరెక్టుగా చెన్నై వరకు వెళ్ళే బస్సు దొరికింది. అక్కడినుండి మా ఊరికి మూడు గంటల ప్రయాణం. కాబట్టి ఇబ్బంది లేదు.  సాయంత్రం ఆరు గంటలకు బస్సు బయల్దేరింది. మాకు మొదటి రెండు సీట్లు దొరికాయి. అంత బాగానే ఉంది. తెల్లవారు ఝామున అందరు నిద్రపోతున్నారు. ఉన్నట్టుండి పెద్దచప్పుడు, వెంటనే కుదుపుకి కూర్చున్న సీటు నుండి కింద పడినట్లయింది. చుట్టూ మాటలు, అడుగుల చప్పుళ్ళు, ఏంటో అంత కోలాహలంగా అయ్యింది ఇవన్ని క్షణాల్లో జరిగిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి నేను కూర్చున్న సీటుకి అవతలి సీటు కి మధ్యలో చెక్క విరిగిపోయి రోడ్డు కనిపిస్తోంది. ఏమి అర్ధం కాక తల తిప్పి చూసేసరికి డోర్ దగ్గర ఒక వ్యక్తి తలకి చేతులకి అంత గాయాలతో నిలబడి, ఏమి కాలేదు కదా, బానే ఉన్నారు కదా అని అడుగుతున్నాడు. కొన్ని క్షణాలు ఏమి అర్థం కాలేదు నాకు. అర్థం అవ్వగానే వెంటనే పక్కకి చూసాను నాన్న కోసం.

నాన్న తను కూర్చున్న సీటు కి ఎదురుగ ఉండే అద్దానికి మధ్య లో ఇరుక్కున్నట్లు మోకాళ్లమీద ఉన్నారు.  తల అద్దానికి ఆనుకుని ఉంది. కదలట్లేదు. గుండెలు అడురుతుండగా నాన్నా అని భుజం కదిపాను. అంతే....... ఉన్నపళంగా తన తల నా ఒళ్లో వాలిపోయింది. మనిషి కదలట్లేదు. గుండె ఝల్లు మానింది. అరచేతుల్లో చెమటలు పట్టేసాయి. ఏమి అర్థం కాలేదు. ఈ లోపు ఎదో స్పురించింది. వెంటనే నాన్నా నాన్నా అని పిలుస్తూ భుజం పట్టుకుని కుదిపేయ సాగాను.  ఒకటి రెండు నిముషాలు అలా ఊపేసిన తరువాత eక్కడో లోతు నుండి చిన్న మాట వినపడింది. అప్పటికి మాట్లాడారు. తల నొప్పిగా ఉంది కడపకు అని.  అప్పటికి మనసు కాస్త కుదుటపడింది. ఆయనకీ నుదిటిమీద గాయం అయ్యింది.

ఈలోపు బస్సులో నుండి అందరు దిగిపోయారు.  మిగిలిన కొందరు నన్ను బస్సు దిగమని చెప్పి నాన్నని మేము దిన్చుతము అని అన్నారు. బస్సు దిగి చూస్తే ముగ్గురు నలుగురు తప్పించి దాదాపు అందరు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఒక వ్యక్తి మాత్రం రోడ్డు మీద అల కూర్చుంది పోయారు. గాయలైతే ఏమి లేవు కాని ఒక చేతిని తల మీద పెట్టుకుని బస్సుకు ఎదురుగ కూర్చున్నారు. ఆయన తదేకంగా నన్నే చూస్తున్నారు.

ఈలోపు అంబులెన్సు వచ్చింది. కాలు ఫ్రాక్చర్ అయిన కారణంగా కండక్టర్ ని, మా నాన్నగారిని, ఇంకో ఇద్దరినీ అమ్బులన్సు లో ఎక్కించి, నాన్నకు తోడుగా నన్ను ఎక్కమన్నారు. అప్పటి వరకు రోడ్డుమీద కూర్చున్న వ్యక్తి ఉన్నట్టుండి నేను కూడా అమ్బులన్సు లో వస్తాను అని లేచాడు మీకేమి గాయాలు అవ్వలేదు కదా మీరెందుకు అని పోలీస్ వాళ్ళు అన్న కాని వినకుండా అమ్బులన్సు ఎక్కి హాస్పిటల్ కి వచ్చాడు. అక్కడ అందరికి ఫస్ట్ ఎయిడ్ చేసారు. నాన్నకి నుదిటి మీద ఆరు ఏడూ కుట్లు పడ్డాయి. ఇంకా కాలి కి కూడా బాగా గాయమైంది.  sedation ఇచ్చినందువల్ల నాన్న నిద్రపోతున్నారు.  అంత సేపు ఆ వ్యక్తి మాకు ఎదురుగ ఉన్న బెడ్ మీదే కుర్చుని మమ్మల్నే చూస్తున్నాడు.

నాన్నకు ఓ అరగంటకి మెలుకువ వచ్చింది కాని మత్తు ఇంకా పోలేదు. ఆ వ్యక్తి నాన్న దగ్గరకు వచ్చి ఎలా ఉంది ఏంటి కనుక్కుని ఎక్కడికి వేలుతున్నమో అడిగారు.  నాన్న చెన్నై అని చెప్పగానే నేను కూడా చెన్నై వేలుతున్నండి, ఇక్కడికి ఆఫీస్ పని మీద వచ్చాను. ఆక్సిడెంట్ కారణంగా బి.పి డౌన్ అయిన కారణంగా హాస్పిటల్ కి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను. పదండి మీతో పాటు చెన్నై వరకు నేను తోడు వస్తాను అని చెప్పి నాన్న సరిగా నడవలేకున్నారని, నన్ను నాన్నని గమనిన్చుకోమని చెప్పి ఆయనే మా లగేజి కూడా మోసి బస్టాండ్ వరకు వచ్చి నాన్నని తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించారు. వేరే చెన్నై బస్సు ఎక్కాము. బస్సులో ప్రయాణం చేస్తున్నంత సేపు మమ్మల్ని గమనిన్చుకున్తూనే ఉన్నారు.

కొన్ని గంటల ప్రయాణం తరువాత బస్సు తిరుచ్చి లో ఆగింది. నాన్న అప్పటికి కాస్త తేరుకున్నారు. తనంతట తానే బస్సు దిగి అలా నడిచారు.  మాతో పాటు వచ్చిన వ్యక్తి నాన్నతో వెళ్లి భోజనం చేసారు. నాన్న మాములుగా మాట్లాడుతూ ఉండటం తో నయు అప్పటివరకు ఉన్న టెన్షన్ అంతా పోయింది.

ఉన్నట్టుండి కిటికీ దగ్గర చప్పుడైతే చూసాను. అప్పటివరకు మాతో ఉన్న వ్యక్తి తన బాగ్ తగిలించుకుని నేను బయల్దేరుతున్నాను అన్నారు. అదేంటి చెన్నై కదా మీరు వెళ్ళాల్సింది అని అంటే చెన్నై లో నాకేం పని? ఇదే మా ఊరు. నేను దిగాల్సిన స్టేషన్ ఇదే. అని చెప్పారు మరి పొద్దున్న మీరే అన్నారు కదా చెన్నై వరకు వెళ్ళాలి అని అంటే నేనెప్పుడు అన్నాను? ఇదే మా ఊరు. మీరు జాగ్రత్త గా వెళ్ళండి. ఇంటికి వెళ్ళే వరకు నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళిన తరువాత హాస్పిటల్ కి వెళ్ళండి అని చెప్పేసి వేరే మాట మాట్లాడే లోపు వెళ్లి పోయారు.

ఎవరా వ్యక్తి? పొద్దున్న చెన్నై చెప్పి ఇప్పుడు ఇక్కడ ఎందుకు దిగిపోయారు? నాన్న పూర్తి గ స్పృహలోకి వచ్చే వరకు, నాకున్న టెన్షన్ తేరుకునే వరకు మాతోనే ఉండి పర్వాలేదు అనుకోగానే వెళ్ళిపోయారు.

మరి ఆయన దేవుడు కాదంటారా? నేను రోజు పూజించే ఇష్ట దైవమే, నన్ను ఎల్లవేళలా కాపాడే ఆ దైవమె  అతని రూపం లో నాకు ఆపద సమయం లో తోడుగా వచ్చారు.కాదంటారా?

Saturday, November 10, 2012

నన్నేల రావయ్య......

నన్నేలు నా దేవరా !
          నిన్నేల అర్చింతురా .......

నీకు మనసైన పూవులతో 
         పూజిన్తునంటే ...

అక్షర సుమాలతో మాలికలల్ల 
         నే కవయిత్రిని కానే.....

సుందర పదములు కుదురుగ కూర్చగ 
         నే స్వరకర్తను కాను  ........

మధుర కీర్తనలు గానము సేయగ 
          నే గాయినిని కాను ...

కనులకింపుగా నాట్యముసేయగా 
         నే నర్తకిని  కాను ........

నా దేవరా ...............

నా మనస్సే నీ కోవెలగ మలచినాను 
ఆత్మనే దివ్వెగా వెలిగించినాను ,
నీ చల్లని చూపు నాపైనిడవయ్య .......

నన్నేల రావయ్య నా దేవర !! 

Saturday, October 6, 2012

అక్షర సుమాంజలి

కలలో పలుకరించావు,
          ఇలలో ఎదుటపడినావు  
స్నేహ హస్తం అందించావు
           ప్రేమనెంతో పంచావు
జీవితాన్ని గడుపుతున్న నాకు
           జీవించడం నేర్పావు 
కష్ట సుఖాలన్నింటిని 
           ఆస్వాదించడం నేర్పావు 
కన్నీరు తుడిచావు
            నవ్వుల్ని పంచావు
తల్లిలా లాలించావు
            తండ్రిలా నమ్మకాన్ని నింపావు
గురువువై హిత బోధలెన్నో చేసావు
            నీవే నా దైవమై నిలిచావు
ప్రాణం లో ప్రాణమైనావు 
           నీవే నా ఊపిరైనావు 
నీ భావాలే
           నాకు మార్గదర్సకాలు
నీ వాక్కులే
          నాకు స్పూర్తిదాయకం
నేస్తమా,

నీవందించిన స్పూర్తి
         నా వెంట వుండగా
అధైర్యమన్నది ఏనాడు 
         నా దరికి చేరలేదు 

Tuesday, September 25, 2012

సరదా కబుర్లు


           ఆలో ఆలో ఆలో ... అందరు బాగున్నారా. అందరికి శుభోదయం. ఉభయ కుసలోపరి.  ఏంటో ఈమధ్య తెలుగు మీద ప్రేమ పొంగిపోతోంది. అయిన ఈమధ్య అని ఏముందిలెండి, నేను చిన్నప్పటి నుండి ఇంతే.  నా స్నేహితులు అందరిలోకి నేనే తెలుగు బాగా మాట్లాడతాను. నేనో తెలుగు భాషాభిమానిని. తెలుగు భాష మీద నాకు మంచి పట్టు ఉంది అని నా మీద నాకు మాచెడ్డ నమ్మకం. మీకు తెలుసా? మా స్నేహితులెవరి పుట్టినరోజైన నేను చక్కగా తెలుగులోనే "జన్మదిన శుభాకాంక్షలు" అని చెప్తాను. వాళ్ళంతా ఎంత సంతోషిస్తారో!
         ఇంత బాగా తెలుగు మాట్లాడే నాకు ఏంటో ఈమధ్య అన్ని అనుమానాలు ఎక్కువైపోయాయి. అసలు నేను మాట్లాడేది తెలుగేన? కాదా? కాకపోతే మరి ఇది ఈ భాష?  ఏమో బాబు నాకు అంత అయోమయంగా ఉంది.  మీరే చెప్పండి. ఇప్పటివరకు నేను మాట్లాడింది అంత తెలుగే కదా. మరి వాడేంటి అలా అంటాడు. పకపక నవ్వేసి "నీ తెలుగు తెల్లారినట్టే ఉంది". జన్మదిన శుభాకాంక్షలు అనేది తెలుగు కాదు తెలుసా నీకు?  అబ్బ ఛా. మరి తెలుగు కాకపోతే ఇంకేంటో. నేను చిన్నప్పటినుండి వింటున్నాను. నాకే చెప్తావ? నిజంగానే. అది సంస్కృతం. అంత లేదు. తెలియకపోతే తెలుసుకో.  నాకే తెలుగు నేర్పిస్తావ? శుభోదయం, శుభాకాంక్షలు, ఇవన్ని తెలుగు  పదాలే. కాదు. కావాలంటే "I will Prove".
       (ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు, వీడు చెప్పేది నిజమేనా? అయిన సరే తగ్గకూడదు.) అని మనసులో అనేసుకుని, "ఆ హా ! మరి అయితే చెప్పు, శుభోదయం ని తెలుగులో ఏమంటారు?" మేలు పొద్దు అంటారు.  మరి సుభాకాంక్షాలని? మేలు తలపులు.  ఓస్ ఇంతేన. ఆమాత్రం అన్వాదాలు మేము చేయగలం. నీ గోప్పెంటి?  ఆ ఆ చెయ్యమ్మా చెయ్యి. ఆ అనువాదాలు విన్న వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు.
       (అవమానం. ఘూర అవమానం. లాభం లేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి) చూద్దాం కాని.  నువ్వు ఏదన్న సంస్కృతం లో చెప్పు, నేను తెలుగు అనువాదం చెప్తాను. అయితే చెప్పు, "కిం కుర్వతి సంజయ"  దీన్ని తెలుగులో చెప్పు.  ఇదేంటి? సంస్క్రతం.  అబ్బ అది కాదు, ఇది అక్కడ ఉంది? ఈ లైను?  అవన్నీ నీకెందుకు? ఏమో ఇది నాకు తెలియదు.  నవ్వే చెప్పు. సరే విను. కిం అంటే ఏమి.  కుర్వతి అంటే కూర వండావు.  అంటే ఏమి కూర వండావు సంజయ అని అర్ధం. ఓహో అవునా!(అమాయకంగా మొహం పెట్టి). పక్కన కిందపడి దోర్లేసి దోర్లేసి నవ్వ్తు, ఈ అనువాదాన్ని నమ్మావు అంటేనే తెలుస్తోంది నీ తెలుగు ఎంతమాత్రమో. వెధవ కాన్వెంట్ చదవు, నువ్వును.
నన్ను ఇంతల అవమానిస్తావా. చూడు ఇప్పుడు నీ హెల్ప్ ఏమి తీసుకోకుండానే నేనే ట్రాన్స్లేట్ చేస్తాను. "సర్వే జన సుఖినో భవంతు"  ఇది సంస్కృతం కదా. చూడు నేను దీన్ని ట్రాన్స్లేట్ చేస్తాను. దీనికర్ధం.....!  ఆ తెలిసింది.  సర్వే చేసే జనాలందరూ సుఖంగా భవంతుల్లో ఉంటారు.

అదండీ సంగతి.