Saturday, December 29, 2012

తెలుగు ప్రపంచ మహాసభలు (part - II)



తాజా వార్త, తాజా వార్త, రండి బాబు రండి తాజా వార్త, తాజా వార్త ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజు విశేషాలు ........
ఈ రోజంతా అయిపోయాక ఇప్పుడు తాజా వార్తేంటి అంటారా???? అయితే వాకే.

నిన్న వెళ్ళినప్పుడు ప్రముఖుల ప్రసంగాలు తప్ప  ఇంకేమి చూడలేదు కదా, పైగా అప్పటికప్పుడు చెప్పినందువల్ల నేను కెమెరా కూడా పట్టుకెళ్ళలేదు ఫోటోలు తీద్దమంటే....అందుకే ఇవ్వాళ సగం రోజు సెలవు పెట్టేసి, నా కొలీగ్ చేత కూడా బలవంతంగా సెలవు పెట్టించి (కూసే గాడిద వచ్చి  మేసే గాడిదని చేడిపింది అంటారు కదా, అలాగన్నమాట) సభా ప్రాంగణానికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే  భోజనశాలకి వెళ్లి భోజనం చేసాము. ఓ పది రకాల కూరలతో భోజన ఏర్పాట్లు బానే చేసారు.

అక్కడి నుండి ఉపవేదికలకి వెళ్ళాము.  ముందుగ సంగీత వేదిక.  ఇక్కడ మేము వెళ్ళే సమయానికి అన్నమాచర్య గీతాలను ఆలపిస్తూ ఉన్నారు.  చాలా చక్కగా పాడారు. తరువాత ఆ  పక్కనే ఉన్న సాహిత్య వేదికకి వెళ్ళాము. అక్కడ భారతి విద్యా భవన్ స్కూల్ పిల్లలు శ్రీ సూక్తం, కృష్ణ సూక్తం నుండి పద్యాలు చెప్తున్నారు.  అందరు ఆరేళ్ళ లోపు పిల్లలే.  అందరు ధోతి, కండువా కట్టుకుని ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలు. అంతే ఠీవిగా , చాలా అందంగా చెప్తున్నారు పద్యాలను.  అసలు ఎంతసేపైనా అక్కడే ఉండిపోవాలనిపించింది, కానీ చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కదా, అందుకే బయటకు రాక తప్పలేదు.

ఆ పక్కనే నృత్య వేదిక. ఇక్కడ శ్రీమతి దేవులపల్లి ఉమ గారి కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతోంది. రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని, అన్నమాచార్యుల వారు రచించిన "వినరో భాగ్యము విష్ణు కథ" అన్న పాటకు ప్రదర్శించారు.  చాలా చాలా బాగున్నింది. కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శన ముగిసే వరకు చూడటం ఇదే మొదటిసారి.  ఇంత అందంగా ఉంటుందా కూచిపూడి నృత్యం అనిపించింది.

తరువాత రంగస్థల వేదిక.  ఇక్కడ ఏదో నాటకం మధ్యలో ఉంది. పైగా  హాలంతా నిండిపోయి ఉంది. అందుకే వెళ్ళలేదు. అయినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో తిరుపతిలో జాతీయ స్థాయి నాటకోత్సవాలు జరుగుతాయి. అప్పుడు వెళ్లి చూదోచ్చులే అని సర్ది చెప్పుకుని, జానపద వేదికకు వెళ్ళాము.  కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. కనీసం నిల్చుకోడానికి కూడా స్థలం లేదు. సరే అనుకుని బయటకు వస్తుంటే, బయట కొందరు లంబాడి వాళ్ళు డాన్సు చేస్తూ కనిపించారు.  వారి ప్రదర్శన కొద్దిసేపు చూసాము.

ఆ తరువాత ప్రధాన వేదిక పక్కన ఉన్న ప్రదర్సనశాలలకు వెళ్ళాము.  ఇక్కడ ప్రతి స్టాల్ ముందు జనాలు క్యూలు కట్టి ఉన్నారు. అలానే క్యూలలో వెళ్లి అన్ని స్టాల్ల్స్ చూసాము. ఇక్కడ "జోడించు " అని ఒక స్టాల్ ముందు బోర్డు ఉంది.  అది ఇంగ్లీష్ లో scrabble ఆట ఉంది కదా, అలా తెలుగులో అన్నమాట. అలాగే ఇంకొకటి టైమర్ తో ఉంటుంది.  చిన్న పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది.

అన్ని చూసాము కానీ చర్చా వేదికలు ఎక్కడా కనిపించలేదు.  సరే వాళ్ళని వెళ్ళని అడిగి కనుక్కుంటూ చర్చా వేదికల వైపు వెళ్ళాము.  ఆ వేదికలకన్నా కాస్త ముందు పుస్తక ప్రదర్శన శాలలు ఉన్నాయి.  ఎన్ని పుస్తకాలో. అప్పటికే రాత్రి అయినందువల్ల అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. ఓ ఐదు పుస్తకాలు మాత్రం కొనేసి బయటకి వచ్చి చర్చా వేదికల వైపు వెళ్ళాము.  ఇవి మొత్తం ఐదు వేదికలు.  మొదటి రెండు ఖాళీగా ఉన్నాయి.  తరువాత మూడింటిలో వేదిక పైన వక్తలు ఉన్నారు కానీ శ్రోతలు పదిమంది లోపే ఉన్నారు.

ఇంక ఇప్పటికి టైం 7.30 అయిపొయింది.  మధ్యాహ్నం 1.30 నుండి అదే పనిగా మొత్తం తిరుగుతున్నాము కదా, ఇంకా ఓపిక కూడా లేదు అందుకే ఇవ్వాల్టికి చాలు అనుకుని, బయటికి వచ్చేసాము. కానీ ఇంకా మనస్సు ఆ పుస్తక ప్రదర్శన శాలల వద్దే ఉండిపోయింది ఇద్దరికీ. అందుకే రేపు కూడా వద్దాం అని నిర్ణయించుకున్నాం.

(బాబోయ్............ రేపు కూడా ఇలా టపా రాసి చంపేస్తుందా ???????????? అని అనుకుంటున్నారా!!!!!!!!!, మీకా భయం వద్దులెండి, రేపు నేను కేవలం పుస్తకాలు కొనడానికే వెళ్తున్నాను. కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు)

Thursday, December 27, 2012

తెలుగు ప్రపంచ మహాసభలు (part -I)



తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర ప్రాంగణం లో నాల్గవ తెలుగు ప్రపంచ మహా సభలు ఇవ్వాళ ఉదయం ప్రారంభమయ్యాయి. ఇవ్వాల్టి నుండి మూడు రోజులు ఈ సభలు / ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగు వారు, సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు, తెలుగు భాషకు విశిష్ట సేవలందించిన వారు అందరు విచ్చేశారు.  వీళ్ళందరితో తిరుపతి నగరం కళకళలాడుతోంది. అందరి సౌకర్యార్ధమ్ తిరుపతి లోని అన్ని ప్రాంతాల నుండి వేదిక వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసారు. 

ఇవ్వాళ పొదున్న 7.30 గంటలకు మా ఆఫీసు వాళ్ళందరం (మా ఏముంది లెండి, అన్ని ప్రభుత్వ ఆఫీసులు వాళ్ళు, బడి పిల్లలు, కాలేజి పిల్లలు అందరు ఊరేగింపుగా సభా ప్రాంగణం వరకు నడుచుకుంటూ వెళ్ళాము. పిల్లలందరూ వివిధ వేషధారణలతో ఎంతో ముచ్చటగా ఉన్నారు.  ఇంకా కొందరు మన తెలుగు సంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలు, కోలాటం ఆడుతూ వచ్చారు. కొద్దిగా చిన్న పిల్లలకి వాళ్ళ టీచర్లు ఏవో స్లోగోన్లు రాసిచ్చారు. వెళ్ళు వాటిని పెద్దగ దారంతా  చెప్తూ వచ్చారు. (ఉదా: దేశ భాషలందు తెలుగు లెస్స) మొత్తంగా మూడు కిలోమీటర్లు నడక అయిన ఇవన్ని చూస్తూ అసలు అలుపు తెలియలేదు.

మొత్తానికి సభా ప్రాంగణానికి చేరుకున్నాం.  ప్రాంగణమంత పెద్దలతో పిల్లలతో కిటకిటలాడుతోంది. మేము వెళ్లేసరికి డా.అక్కినేని నాగేశ్వర రావు గారు మాట్లాడుతున్నారు. ఆ తరువాత మాగుంట సుబ్బరామి రెడ్డి గారు, వట్టి వసంత కుమార్ గారు మాట్లాడారు.  

అటు తరువాత డా. పి.సుశీల గారు, శ్రీమతి రావు బాల సరస్వతి గారు వందేమాతరం, మా తెలుగు తల్లికి గీతాలను ఆలపించారు.  ఎన్నో పాటలు ఎంతో మధురంగా పాడిన సుశీల గారు, ఎందుకో ఇవ్వాళ మన రాష్ట్ర గీతమైన "మా తెలుగు తల్లికి " పాటను పాడటం లో ఫెయిల్ అయ్యారు అని అనిపించింది.  నాకు ఆ పాడిన తీరు నచ్చలేదు. (ఇది నా అభిప్రాయం మాత్రమే)

తరువాత మన ముఖ్య మంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి గారు, గవర్నర్ నరసింహన్ గారు మాట్లాడారు. ముఖ్య మంత్రి గారి ప్రసంగం ఎప్పటిలా కాకుండా చాలా బాగుంది అనే చెప్పొచ్చు.  అక్కడక్కడ కొన్ని విభక్తి దోషాలు దొర్లిన కూడా చాలా చక్కగా మాట్లాడారు.  గవర్నర్ గారు కూడా తెలుగు లోనే మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి గారు జ్యోతి ప్రజ్వలనం చేసిన తరువాత ఈ సభల కోసం ప్రత్యేకించి డా.సి. నారాయణ రెడ్డి గారు రాసిన పాటను బాలు గారు పాడాల్సి ఉంది కానీ ఆయనకీ ఆరోగ్యం సరిలేని కారణం గా దాని రికార్డు ప్లే చేసారు.పాట  మాత్రం చాలా చాలా బాగుంది.  " మా తెలుగు తల్లికి జేజేలు , ఆ వెలుగు వెల్లువకు జోహారు" అని మొదలవుతుంది ఈ పాట.  కోటి గారు స్వరపరచిన ఈ పాటని బాలు గారు ఎంతో ఎనేర్జిటిక్ గా పాడారు.  ఇంకా దేశ విదేశాల్లో ఉన్నత శిఖరాలని అధిరోహించిన కొందరు తెలుగు వారిని సన్మానించారు.  వీరిలో మన బాపు గారు కూడా ఉన్నారు.

ఇంక అప్పటికే నాకు ఆఫీసు నుండి ఫోన్ రావడం తో మళ్లీ రేపో ఎల్లుండో వద్దాం అని బయటకి వచ్చేసాం.

అన్నట్టు ఈ సభలకు ప్రత్యేక ఆకర్షణ గా "అక్షర కల్పవృక్షం" ఏర్పాటు చేసారు.  ప్రధాన వేదిక కాకుండా, సాహితి వేదిక, జానపద వేదిక అని మరో ఐదు ఉపవేదికలు, నాలుగు చర్చా వేదికలు ఏర్పాటు చేసారు.  ఇంకా వివిధ ప్రదర్సనశాలలు  కూడా ఉన్నాయి. ఇంకా చలన చిత్రాల ప్రదర్శనకు రెండు సినిమా హాళ్ళు ఎంపిక చేసారు.  స్థానిక మహతి కళాక్షేత్రం లో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులే.

Wednesday, December 26, 2012

ఏం చెప్పాలి.............???????????


ఈ పిల్లలున్నారే .......................!! ఒక్కోసారి తెగ ముద్దోచ్చేస్తారు. వాళ్ళ మాటలు ఎంత ముద్దుగా  ఉండి మురిపిస్తాయో , ఇంకోసారి అంతే విసిగించేస్తారు.  చిన్నప్పుడు ఆ వచ్చీ రాని మాటలు వింటుంటే ఎంతో అబ్బుర పడిపోయి మళ్లీ మళ్లీ వినాలి అని తెగ ముచ్చట పడిపోతూఉంటాము .  కానీ వాళ్ళు పెద్దయ్యేకొద్దీ వారి మాటలు కొన్నిసార్లు చాలా ఆందోళన కలిగిస్తాయి. భవిష్యత్తులో వీరేమైపోతారా అన్న దిగులు కూడా పుడుతుంది.

అదంతా సరేకానీ ఈ సోదంతా మాకెందుకు  చెప్తున్నావు?????????????? అని అనుకుంటున్నారా .............??
వస్తున్నా , వస్తున్నా అక్కడికే వస్తున్నా...

ఏమీ లేదండీ, నా అదృష్టం పుచ్చిపోయి, నక్కని, పిల్లిని, కుక్కని అన్నింటిని ఏకకాలం లో తోక్కేసానేమో (???!!!!) నిన్న ఆఫీసులో పని కాస్త తక్కువగా ఉండటం వల్ల సాయంత్రం 3.30కే ఆఫీసు నుండి బయట పడ్డాను.  ఓ మూడు నెలల తరువాత అనుకుంటా ఇలా వెలుతురు ఉండగానే ఆఫీసు నుండి బయటకు రావడం.


 ఇంటికి వచ్చీ రాగానే పక్కింట్లో పిల్లలు, మిద్దె మీది పిల్లలు అందరు ఆంటీ నువ్వు ఈ రోజు త్వరగా వచ్చేసావుగా అయితే మాతో ఆడుకోవాలి ఇవ్వాళ అని మొదలెట్టారు. ఒకటి నుండి పది క్లాసుల మధ్యలో ఓ ఐదు మంది పిల్లలు వీళ్ళు. సరే అయితే ముందు మనం కాసేపు చదువుకుందాం తరువాత ఆడుకుందాం అని చెప్పి నాలోని ఒక టీచర్ ని , ఒక మెంటర్ ని, అందరిని మేల్కొలిపే ప్రయత్నం చేసాను.

4th class పిల్లతో ముచ్చట్లు:

 "ఇది ఏంటి?"   మావిడి చెట్టు.
 మరి దీని పండ్ల పేరేంటి?  "మామిడి పండ్లు"  ఓ గుడ్ మరైతే ఇప్పుడు చెప్పు, మామిడి పండ్లు ఏ చెట్టుకి కాస్తాయి?
"ఏమో తెలియదు ఆంటీ"  అదేంటే ఇప్పుడేగా చెప్పావు, మామిడి చెట్టుకి మామిడి పండ్లు వస్తాయి అని, మరి మామిడి పండ్లు ఏ చెట్టుకి కాస్తాయి అంటే తెలియదు అంటావే?
"మామిడి చెట్టుకి మామిడి పండ్లు కాస్తాయి అని మా టీచర్ చెప్పింది ఆంటీ, కానీ మామిడి పండ్లు ఏ  చెట్టుకి వస్తాయో చెప్పలేదు "

ఒక్కసారి గా మైండ్ బ్లాక్ అవ్వడం అంటే ఏంటో అప్పుడు తెలిసింది. నా పక్కనే ఉన్న ఆ పిల్ల తల్లి "స్వాతీ .... దీన్ని ఇంకేమి అడక్కు, దీని నెత్తిన నేను  పెట్టిన యాభై వేలు గిర్రున తిరుగుతున్నాయి. దీని నోటినుండి ఇంకేమి వినాల్సి వస్తుందో అన్న టెన్షన్ కే నాకు కళ్ళు తిరుగుతున్నాయి" అంది.

9th class పిల్లతో ముచ్చట్లు:

ఏ శ్రావ్య, నువ్వు చెప్పు, నీకు లెటర్ రైటింగ్ ఉంది కదా? "ఆ ఉంది అక్కా" అయతే చెప్పు, PIN అంటే ఏంటి? "లెటర్ రైటింగ్ లో PIN ఏంటి అక్కా?"  సరే అయితే మన ఇంటి పోస్టల్ అడ్రస్ చెప్పు. "...........,............, .........., -01"  హ్మ్మ్ ఇప్పుడు 01 అన్నావు కదా ఆ  నెంబర్ ఏంటి? "అంటే అక్క, ప్రతి అడ్రస్ తరువాత అలా ఒక నెంబర్ రాయాలి. కాని అది ఎందుకో తెలియదు"
PIN అంటే Postal Index Number.  టెక్స్ట్ బుక్స్ కి ఫస్ట్ లో ఇస్తారు కదా ఒక్కో చాప్టర్ ని, లెసెన్ ని గుర్తు పట్టడానికి ఇండెక్స్, అలా పోస్టల్ డిపార్టుమెంటు వాళ్ళు మనం రాసిన అడ్రస్ సులభం గా గుర్తు పట్టడానికి, ఒక్కో ఊరికి, ఒక్కో PIN అలాట్ చేసారన్నమాట.
"మాకు ఇవేమీ చెప్పలేదక్కా మా టీచరు"  పోనిలే అయితే ఒక లెటర్ ని ఎన్ని విధాలుగా పంపవచ్చు?
"అంటే అక్కా మాకు లెటర్ రైటింగ్ ఒక్కటే చెప్పరక్కా, అది ఎలా పోస్ట్ చేయాలో చెప్పలేదు".
వాళ్ళు చెప్పకపోయినా నువ్వు తెలుసుకోవాలి కదా. రేపు నీకు జాబ్ వచ్చిన తరువాత ఇలా లెటర్ పంపడం రాదు అంటే ఎలా?
"జాబ్ జాయిన్ అయ్యాక నేను ఓన్లీ లెటర్ రాస్తాను అంతే కాదక్కా, పోస్ట్ చేయడానికి ఆఫీసు బాయ్ ఉంటాడు గా?"

వారెవ్వా వాట్ ఎన్ ఆన్సర్ సర్జీ అనుకుని, నా చిన్నప్పుడు నాకింత తెలివి లేదే అని నన్ను నేనే తిట్టేసుకుంటూ నేనెంత అజ్ఞానం లో ఉన్నానో తెలుసుకుంటున్న తరుణం లో వచ్చింది ఇంకో ఇంట్లోని U.K.G చదివే పిల్లది. అది రావడం తోనే,

"ఆంటీ ఆంటీ, మేము ఇవ్వాళ లైఫ్ గేమ్ ఆడాము తెలుసా?"  ఓహ్ అవునా గుడ్.
"తెలుసా ఆంటీ, నాకేమో ఫస్ట్ ఎంగేజ్మెంట్ అని వచ్చింది, తరువాత మ్యారేజ్ ఆ తరువాత 3 చిల్ద్రెన్"
ఓహ్ గుడ్.
"ఈ అక్కకేమో ఎంగేజ్మెంట్ అవ్వకుండానే మ్యారేజ్ వచ్చింది డైరెక్ట్ గా" ఓహ్ అవునా.
"మరేమో శ్రావ్య అక్కకి ఎంగేజ్మెంట్ కాలేదు, మ్యారేజ్ లేదు, ట్విన్స్ వచ్చారు ఆంటీ" గుడ్ కదా.
"అది కాదాంటి ఎంగేజ్మెంట్, మ్యారేజ్ రాకుండానే ట్విన్స్ ఆంటీ"  చెప్పావు కాదే ఇప్పుడే, మళ్ళి చెప్తావే?
"అది కాదాంటి, ఎంగేజ్మెంట్ అవ్వక పోయినా పర్లేదు కానీ మ్యారేజ్ అవ్వకుండానే పిల్లలు పుట్టారు అంటే తప్పు కదాంటి" అంది పక్కన పిల్లని చూసి ముసిముసి గా నవ్వుతూ

మై గాడ్ ........................ ఏంటిది? నేను వింటున్న మాటలు !!!!!!!!!!!!!!!! అంత చిన్న పిల్ల .......
ఎవరు నేర్పిస్తున్నారు వీళ్ళకి ఈ మాటలు?  అసలు తప్పొప్పులు అంటే ఏంటో తెలిసే వయసేన అది?  అసలేమనుకోవాలి వీళ్ళని? ఎటు పోతున్నాయి వీళ్ళ ఆలోచనలు? ముందు చెప్పిన ఇద్దరు పిల్లల్ని చూసి వీళ్ళు అమాయకులు అనుకోవాలా? లేక తరువాతి పిల్లని చూసి ముదుర్లు అనుకోవాలా?

ఎందుకో మనస్సంత కేలికినట్టు ఏదో తెలియని బాధ. ఏమిటి ఈ పిల్లల భవిష్యత్తు?