Thursday, December 27, 2012

తెలుగు ప్రపంచ మహాసభలు (part -I)తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర ప్రాంగణం లో నాల్గవ తెలుగు ప్రపంచ మహా సభలు ఇవ్వాళ ఉదయం ప్రారంభమయ్యాయి. ఇవ్వాల్టి నుండి మూడు రోజులు ఈ సభలు / ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగు వారు, సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు, తెలుగు భాషకు విశిష్ట సేవలందించిన వారు అందరు విచ్చేశారు.  వీళ్ళందరితో తిరుపతి నగరం కళకళలాడుతోంది. అందరి సౌకర్యార్ధమ్ తిరుపతి లోని అన్ని ప్రాంతాల నుండి వేదిక వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసారు. 

ఇవ్వాళ పొదున్న 7.30 గంటలకు మా ఆఫీసు వాళ్ళందరం (మా ఏముంది లెండి, అన్ని ప్రభుత్వ ఆఫీసులు వాళ్ళు, బడి పిల్లలు, కాలేజి పిల్లలు అందరు ఊరేగింపుగా సభా ప్రాంగణం వరకు నడుచుకుంటూ వెళ్ళాము. పిల్లలందరూ వివిధ వేషధారణలతో ఎంతో ముచ్చటగా ఉన్నారు.  ఇంకా కొందరు మన తెలుగు సంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలు, కోలాటం ఆడుతూ వచ్చారు. కొద్దిగా చిన్న పిల్లలకి వాళ్ళ టీచర్లు ఏవో స్లోగోన్లు రాసిచ్చారు. వెళ్ళు వాటిని పెద్దగ దారంతా  చెప్తూ వచ్చారు. (ఉదా: దేశ భాషలందు తెలుగు లెస్స) మొత్తంగా మూడు కిలోమీటర్లు నడక అయిన ఇవన్ని చూస్తూ అసలు అలుపు తెలియలేదు.

మొత్తానికి సభా ప్రాంగణానికి చేరుకున్నాం.  ప్రాంగణమంత పెద్దలతో పిల్లలతో కిటకిటలాడుతోంది. మేము వెళ్లేసరికి డా.అక్కినేని నాగేశ్వర రావు గారు మాట్లాడుతున్నారు. ఆ తరువాత మాగుంట సుబ్బరామి రెడ్డి గారు, వట్టి వసంత కుమార్ గారు మాట్లాడారు.  

అటు తరువాత డా. పి.సుశీల గారు, శ్రీమతి రావు బాల సరస్వతి గారు వందేమాతరం, మా తెలుగు తల్లికి గీతాలను ఆలపించారు.  ఎన్నో పాటలు ఎంతో మధురంగా పాడిన సుశీల గారు, ఎందుకో ఇవ్వాళ మన రాష్ట్ర గీతమైన "మా తెలుగు తల్లికి " పాటను పాడటం లో ఫెయిల్ అయ్యారు అని అనిపించింది.  నాకు ఆ పాడిన తీరు నచ్చలేదు. (ఇది నా అభిప్రాయం మాత్రమే)

తరువాత మన ముఖ్య మంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి గారు, గవర్నర్ నరసింహన్ గారు మాట్లాడారు. ముఖ్య మంత్రి గారి ప్రసంగం ఎప్పటిలా కాకుండా చాలా బాగుంది అనే చెప్పొచ్చు.  అక్కడక్కడ కొన్ని విభక్తి దోషాలు దొర్లిన కూడా చాలా చక్కగా మాట్లాడారు.  గవర్నర్ గారు కూడా తెలుగు లోనే మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి గారు జ్యోతి ప్రజ్వలనం చేసిన తరువాత ఈ సభల కోసం ప్రత్యేకించి డా.సి. నారాయణ రెడ్డి గారు రాసిన పాటను బాలు గారు పాడాల్సి ఉంది కానీ ఆయనకీ ఆరోగ్యం సరిలేని కారణం గా దాని రికార్డు ప్లే చేసారు.పాట  మాత్రం చాలా చాలా బాగుంది.  " మా తెలుగు తల్లికి జేజేలు , ఆ వెలుగు వెల్లువకు జోహారు" అని మొదలవుతుంది ఈ పాట.  కోటి గారు స్వరపరచిన ఈ పాటని బాలు గారు ఎంతో ఎనేర్జిటిక్ గా పాడారు.  ఇంకా దేశ విదేశాల్లో ఉన్నత శిఖరాలని అధిరోహించిన కొందరు తెలుగు వారిని సన్మానించారు.  వీరిలో మన బాపు గారు కూడా ఉన్నారు.

ఇంక అప్పటికే నాకు ఆఫీసు నుండి ఫోన్ రావడం తో మళ్లీ రేపో ఎల్లుండో వద్దాం అని బయటకి వచ్చేసాం.

అన్నట్టు ఈ సభలకు ప్రత్యేక ఆకర్షణ గా "అక్షర కల్పవృక్షం" ఏర్పాటు చేసారు.  ప్రధాన వేదిక కాకుండా, సాహితి వేదిక, జానపద వేదిక అని మరో ఐదు ఉపవేదికలు, నాలుగు చర్చా వేదికలు ఏర్పాటు చేసారు.  ఇంకా వివిధ ప్రదర్సనశాలలు  కూడా ఉన్నాయి. ఇంకా చలన చిత్రాల ప్రదర్శనకు రెండు సినిమా హాళ్ళు ఎంపిక చేసారు.  స్థానిక మహతి కళాక్షేత్రం లో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులే.

4 comments:

 1. వెళ్లలేకపోయామన్న బాధ లేకుండా చక్కగా కబుర్లన్నీ రాసినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
  Replies
  1. తృష్ణ గారు, ఫోటోలు అప్లోడ్ చేయడం తెలియలేదు నాకు. మీకు పంపుతాను.

   Delete
 2. అక్షర కల్పవృక్షం అంటే అక్షరాలతో చెట్టులా ఏమైనా తయారు చేశారాండీ?

  ReplyDelete
  Replies
  1. శిశిర గారు, ఒక 20 అడుగుల చెట్టుకి అక్షరాలని ఫలాలుగా వేలాడదీసారు

   Delete