Friday, March 15, 2013

ఏడు చేపల కథ

అనగనగా ఒక రాజు

"అనగనగా ....... "  ఈ మాట వినగానే మన మనస్సు ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలని స్పృశిస్తుంది కదా .  చిన్నప్పుడు మన చేత అన్నం తినిపించడానికి, మనల్ని నిద్రపుచ్చడానికి  అమ్మ మనకు ఎన్ని కథలు చెప్పేదో కదా.  ఇంక అమ్మమ్మలు నానమ్మల సంగతైతే చెప్పక్కర్లేదు.  పడుకునే ముందు మంచి మంచి కథలు అమ్మమ్మ / నాన్నమ్మ  చెప్తుంటే వింటూ నిద్రలోకి జారుకోవడం ఎంత  బాగుంటుందో .


చిన్నప్పుడు అమ్మమ్మ మా ఇంటికి వస్తోందన్నా లేకపోతే మేమే అమ్మమ్మ దగ్గరకి వెళుతున్నామన్న ఎంత ఆనందమో.  అమ్మమ్మ దగ్గర బోలెడు కథలు చెప్పించుకోవచ్చు .  ఇంకా మా బాబాయి అయితే భక్త ప్రహ్లాద, భక్త సిరియాలుడు, లాంటి కథల నుండి మాయాబజార్ లాంటి సినిమా కథలు కూడా చెప్పెవారు. ఒక్కో కథ చెప్పిన తరువాత ఆ కథలోని నీతి కూడా వివరించెవారు.


అందరి అమ్మలు, అమ్మమ్మలు , నాన్నమ్మలు, తాతయ్యలు ఒకే లాంటి కథలు చెప్పకపోయినా, కొన్ని కథలు మాత్రం స్టాండర్డ్.  అలాంటి కోవలోకి వచ్చే కథే


"ఏడు  చేపల కథ"


నాకు చిన్నప్పటి నుండి ఒక డౌటనుమానం ఏంటంటే, అన్ని కథల్లోనూ ఏదో ఒక నీతి ఉంటుంది కదా, మరి ఈ ఏడు చేపల కథలో నీతి ఎంటా???? అని!!
వినడానికి ఎంతో సాదాసీదాగా తమాషాగా ఉండే ఈ కథలో మానవ జీవితానికి సంబంధించిన గొప్ప ఫిలాసఫీ నిగూడమై ఉంది అని రెండు రోజుల క్రితమే తెలిసింది. అదేంటో ఒక్కసారి చూద్దామా ...... 


మామూలుగా  మనిషిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అని ఆరు చెడ్డ గుణాలు ఉంటాయి కదా, అలానే మనిషిని అతః పాతాళానికి నెట్టేసే ఏడు వ్యసనాలు ఉన్నాయి.
జూదము, సురాపానము, వెలది, మొదలైన ఈ సప్త వ్యసనాలకు ఒక్కసారి బానిసైతే ఇక అందులో నుండి బయటకు రావడం చాలా కష్టం.   మన పురాణాలలో ఎందఱో మహా పురుషులు కూడా ఒక్క వ్యసనం వల్ల ఎంతో నష్టపోయారు.  


ఉదాహరణకి ఎంతో ఉత్తముడైన దార్మరాజు, జూదం కారణంగా అడవులపాలయ్యాడు. దశరథుడు వేట అనే వ్యసనం కారణంగానే శాపగ్రస్తుడై తన కొడుకులు ఎవ్వరు చెంత లేనప్పుడు మరణించాడు.
మనిషి తన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నా, సద్గతులు పొందాలన్నా ఈ సప్త వ్యసనాలను త్యజించాగాలగాలి.   


ఇప్పుడు ఈ కథకు, ఈ వ్యసనాలకు లింకేంటో అందులో ఉన్న ఫిలాసఫీ ఏంటో చూద్దాం. 


ఈ కథలో మన రాజుగారి కుమారులు పట్టుకొచ్చిన ఏడు చేపలే ఈ సప్త వ్యసనాలు.
వాటిని ఎండబెట్టారు అంటే త్యజించే ప్రయత్నం అన్నమాట
కానీ ఒక్క చేప మాత్రం ఎండలేదు - అంటే ఒక్క వ్యసనం మానలేదు
కారణం గడ్డి మోపు అడ్డం వచ్చింది - అంటే అజ్ఞానానికి సంకేతమైన చీకటి
కారణం అబ్బాయి గడ్డి ఆవుకు వేయలేదు - అంటే గురువు నేర్పలేదు
కారణం అవ్వ బువ్వ పెట్టలేదు  - అంటే అమ్మవారు / దైవం  శక్తిని ఇవ్వలేదు
ఇందుకు కారణం పిల్లవాడు ఏడుస్తున్నాడు - అంటే ఇక్కడ పిల్లవాడు ఎవరో కాదు మనమే.  మనం ఈ వ్యసనం నుండి బయట పడటానికి మారాం చేస్తున్నాం అన్నమాట
కారణం చీమ కుట్టింది - ఇక్కడ చీమ అంటే కోరిక - కోరిక కుడుతోంది
ఎందుకు కుడుతోంది అంటే చీమ చెప్పిన సమాధానం - నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా???
దీనికి అర్థం, కోరికల పుట్టలో మునిగి తేలుతుంటే కొరిక కుట్టకుండా ఉంటుందా???


కాబట్టి మనిషి కోరికలను జయించగలిగితే మిగితా ఏ వ్యసనాన్నైనా సులభంగా త్యజించగలడు, తద్వారా జీవితాన్ని జయించగలడు 


ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని ఈ కాన్సెప్ట్ నచ్చింది అందుకనే మీతో పంచుకోవాలనిపించింది. 


చివరగా తను అర్థం చేసుకున్న ఈ వివరణను మాతో పంచుకున్న శ్రీ రాజా రెడ్డి గారికి నా ధన్యవాదాలు.