Thursday, September 5, 2013

సెప్టెంబరు 5

సెప్టెంబరు 5.   ఈ తారీఖు అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం నాకు. బాగా చిన్నప్పుడు  ఆ రోజు ప్రత్యేకత తెలియదు కానీ స్కూలుకు సెలవు ఇస్తారు ఆ రోజు.  కడుపు నొప్పి, తల నొప్పి అని వంకలు చెప్పకుండా ఎంచక్కా ఇంట్లో ఉండిపోవచ్చు. ఈ తారీఖు ఏ శనివారమో  సోమవారమో వచ్చిందంటే ఇంకా సంతోషం ఎందుకంటే హ్యాపీ గా రెండు రోజులు ఇంట్లో ఉండి బాగా ఆడుకోవచ్చు.  

ఇంకాస్త పెద్దయ్యాక ఆ రోజున స్కూల్ కి వెళితే చాకలెట్లు పంచుతారు, టీచర్ లకు గిఫ్ట్లు ఇస్తారు ఇంకా స్టేజి మీద ప్రోగ్రాములు ఉంటాయి.    కానీ క్లాసులు మాత్రం జరగవు. చక్కగా ఫ్రెండ్స్ తో సరదాగ గడిపి వచ్చేయొచ్చు. 

హై స్కూల్ కి వచ్చే దాక తెలీలేదు ఈ రోజు ఏంటో.  సెప్టెంబర్ 5 teacher's  Day / ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు అని, ఆ రోజు టీచర్ లు అందరికి సన్మానం చేసి గురు పూజ చేస్తారు అని, వారి పట్ల మనకున్న గౌరవాభిమానాల్ని చాటుకుంటాం అని తెలిసింది. 

ఇవ్వాళ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మా టీచర్లని అందరిని మరోసారి గుర్తుచేసుకుంటూ వారికి నా వందనాలు, అభినందనలు. 

సాధారణంగా ప్రతి విద్యార్ధి కి తమ ఉపాధ్యాలులందరిలో ఒక favourite teacher ఉంటారు. అలానే నా favourite teacher నా 5th  క్లాసు క్లాసు టీచర్ అయిన గాయత్రీ టీచర్. నాకు స్కూల్లో టీచర్లు అందరు ఇష్టమే కానీ ఈవిడంటే ప్రత్యేకమైన అభిమానం, గౌరవం .  స్కూల్ చదువులు ముగిసి దాదాపుగా 15 సంవత్సరాలు గడిచినా స్నేహితులందరం కలిసినప్పుడు ఆవిడ గురించి తప్పకుండా అనుకుంటాము.   ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే 15 సంవత్సరాల తరువాత ఈ మధ్యనే టీచర్ గారి e - mail  id దొరికింది.  తనకు మెయిల్ పెట్టగానే వెంటనే రిప్లై ఇచ్చారు. ఆ రోజు  కలిగిన ఆనందం ఎప్పటికి మరచిపోలేనిది.  

అలాగే నా favourite teachers లిస్టు లో చెప్పకపోయినా  నేను గౌరవించే టీచర్ ఇంకొకరు ఉన్నారు.  ఆయనే నా షార్ట్ హ్యాండ్ tutor కామేశ్వర రావు గారు.   ఈయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. కేవలం చదువే కాకుండా జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు ఆయన నుండి నేర్చుకున్నాము.   ఏ విషయం కుడా burden లా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయడం.  ప్రతి సమస్యని చిరునవ్వుతో స్వీకరించడం.  గెలుపుని ఓటమిని సమానంగా చూడటం నేర్పారు.  

ఆయన తరచూ మాతో చెప్పిన మాట - "నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి - either famous  or  notorius " ;       "నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి  - నువ్వు రోడ్లు ఊడ్చే పని చేసినా కుడా నువ్వు చిమ్మిన ఏరియా కి పక్కవాడు చిమ్మిన ఏరియా కి తేడా స్పష్టంగా కనిపించాలి" అని. 

జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా , ఎన్ని కష్టాలు వచ్చినా ముఖం మీది చిరునవ్వును మాత్రం తీసేయకూడదు. 


ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన నుండి నేర్చుకున్నాను.  అన్నిటిని ఫాలో అవ్వకపోయినా నా జీవితంలో చాలా విషయాల్లో ఆ మాటల ప్రభావం ఉందనే చెప్పొచ్చు.  

మాతృ ఋణం , పితృ ఋణం ఏ కాదు గురువు ఋణం కుడా ఎప్పటికి తీర్చలేనిది.  

నా జీవితంలో ఇప్పటివరకు నా ఎదుగుదలకు కారణమైన గురువులందరికీ పేరు పేరు న నమస్కరిస్తున్నాను.  శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.  

         I Owe to my PARENTS, who LET  me Live in this World;

                                                                          But,

  I Owe More to my TEACHERS, Who TAUGHT me How to Live                                                                                       in this World


Friday, August 23, 2013

ఎందుకమ్మా ... అంత కోపం

// ఇవ్వాళ పొద్దున్న బయటకు వచ్చినప్పుడు తల పైకి ఎత్తడమే కాదు కనీసం కళ్ళు కూడా తెరవలేనంత ఎండ .... ఆ సమయంలో సూర్యున్ని ఉద్దేశించి  నా మదిలో మెదిలిన చిన్న భావం //  ఏయ్ .......... ,

ఎందుకమ్మా ... అంత కోపం నా మీద ........ ???!!!!

నీ చూపుల్లోని ఆ తీక్షనతకు..... 
           నే తాళ గలనా ....... ????

నీ కళ్ళలోని ఆ కోపాగ్ని ....... 
       అమ్మో ... నే భాస్మమైపోను ..... !!!!!

నిన్ను చూడకుండా... 
      నాకు పొద్దే గడవదే .......... !!!!!!!

నీ వెచ్చని అండ లో .... 
     నే హాయిగా జీవిస్తున్నానే ..... !!!!

నీవు లేక నాకు 
       ఈ లోకమే లేదు కదా .....!!!!!

నీతోనే నా జీవితం మొత్తం 
       పెనవేసుకుని ఉందని భావిస్తున్నానే ...... !!!!!

అలాంటి నాపై ...... ఇంత కోపమా ...... ???!!!!
             జాలి చూపవా నా పైనా ......... 

ఏది ..... ఆ మేఘం ...... ???
          ఎక్కడ దాక్కుని ఉందీ .......???

నన్ను కరుణించి ...... ఆ మేఘమాలను కరిగించి ......,
నీ చిరునవ్వుల చిరు ఝాల్లులు నా పై కురిపించవూ ....... 
నా జీవితాన హరివిల్లులు పోయించవూ ....... 

Friday, March 15, 2013

ఏడు చేపల కథ

అనగనగా ఒక రాజు

"అనగనగా ....... "  ఈ మాట వినగానే మన మనస్సు ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలని స్పృశిస్తుంది కదా .  చిన్నప్పుడు మన చేత అన్నం తినిపించడానికి, మనల్ని నిద్రపుచ్చడానికి  అమ్మ మనకు ఎన్ని కథలు చెప్పేదో కదా.  ఇంక అమ్మమ్మలు నానమ్మల సంగతైతే చెప్పక్కర్లేదు.  పడుకునే ముందు మంచి మంచి కథలు అమ్మమ్మ / నాన్నమ్మ  చెప్తుంటే వింటూ నిద్రలోకి జారుకోవడం ఎంత  బాగుంటుందో .


చిన్నప్పుడు అమ్మమ్మ మా ఇంటికి వస్తోందన్నా లేకపోతే మేమే అమ్మమ్మ దగ్గరకి వెళుతున్నామన్న ఎంత ఆనందమో.  అమ్మమ్మ దగ్గర బోలెడు కథలు చెప్పించుకోవచ్చు .  ఇంకా మా బాబాయి అయితే భక్త ప్రహ్లాద, భక్త సిరియాలుడు, లాంటి కథల నుండి మాయాబజార్ లాంటి సినిమా కథలు కూడా చెప్పెవారు. ఒక్కో కథ చెప్పిన తరువాత ఆ కథలోని నీతి కూడా వివరించెవారు.


అందరి అమ్మలు, అమ్మమ్మలు , నాన్నమ్మలు, తాతయ్యలు ఒకే లాంటి కథలు చెప్పకపోయినా, కొన్ని కథలు మాత్రం స్టాండర్డ్.  అలాంటి కోవలోకి వచ్చే కథే


"ఏడు  చేపల కథ"


నాకు చిన్నప్పటి నుండి ఒక డౌటనుమానం ఏంటంటే, అన్ని కథల్లోనూ ఏదో ఒక నీతి ఉంటుంది కదా, మరి ఈ ఏడు చేపల కథలో నీతి ఎంటా???? అని!!
వినడానికి ఎంతో సాదాసీదాగా తమాషాగా ఉండే ఈ కథలో మానవ జీవితానికి సంబంధించిన గొప్ప ఫిలాసఫీ నిగూడమై ఉంది అని రెండు రోజుల క్రితమే తెలిసింది. అదేంటో ఒక్కసారి చూద్దామా ...... 


మామూలుగా  మనిషిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అని ఆరు చెడ్డ గుణాలు ఉంటాయి కదా, అలానే మనిషిని అతః పాతాళానికి నెట్టేసే ఏడు వ్యసనాలు ఉన్నాయి.
జూదము, సురాపానము, వెలది, మొదలైన ఈ సప్త వ్యసనాలకు ఒక్కసారి బానిసైతే ఇక అందులో నుండి బయటకు రావడం చాలా కష్టం.   మన పురాణాలలో ఎందఱో మహా పురుషులు కూడా ఒక్క వ్యసనం వల్ల ఎంతో నష్టపోయారు.  


ఉదాహరణకి ఎంతో ఉత్తముడైన దార్మరాజు, జూదం కారణంగా అడవులపాలయ్యాడు. దశరథుడు వేట అనే వ్యసనం కారణంగానే శాపగ్రస్తుడై తన కొడుకులు ఎవ్వరు చెంత లేనప్పుడు మరణించాడు.
మనిషి తన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నా, సద్గతులు పొందాలన్నా ఈ సప్త వ్యసనాలను త్యజించాగాలగాలి.   


ఇప్పుడు ఈ కథకు, ఈ వ్యసనాలకు లింకేంటో అందులో ఉన్న ఫిలాసఫీ ఏంటో చూద్దాం. 


ఈ కథలో మన రాజుగారి కుమారులు పట్టుకొచ్చిన ఏడు చేపలే ఈ సప్త వ్యసనాలు.
వాటిని ఎండబెట్టారు అంటే త్యజించే ప్రయత్నం అన్నమాట
కానీ ఒక్క చేప మాత్రం ఎండలేదు - అంటే ఒక్క వ్యసనం మానలేదు
కారణం గడ్డి మోపు అడ్డం వచ్చింది - అంటే అజ్ఞానానికి సంకేతమైన చీకటి
కారణం అబ్బాయి గడ్డి ఆవుకు వేయలేదు - అంటే గురువు నేర్పలేదు
కారణం అవ్వ బువ్వ పెట్టలేదు  - అంటే అమ్మవారు / దైవం  శక్తిని ఇవ్వలేదు
ఇందుకు కారణం పిల్లవాడు ఏడుస్తున్నాడు - అంటే ఇక్కడ పిల్లవాడు ఎవరో కాదు మనమే.  మనం ఈ వ్యసనం నుండి బయట పడటానికి మారాం చేస్తున్నాం అన్నమాట
కారణం చీమ కుట్టింది - ఇక్కడ చీమ అంటే కోరిక - కోరిక కుడుతోంది
ఎందుకు కుడుతోంది అంటే చీమ చెప్పిన సమాధానం - నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా???
దీనికి అర్థం, కోరికల పుట్టలో మునిగి తేలుతుంటే కొరిక కుట్టకుండా ఉంటుందా???


కాబట్టి మనిషి కోరికలను జయించగలిగితే మిగితా ఏ వ్యసనాన్నైనా సులభంగా త్యజించగలడు, తద్వారా జీవితాన్ని జయించగలడు 


ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని ఈ కాన్సెప్ట్ నచ్చింది అందుకనే మీతో పంచుకోవాలనిపించింది. 


చివరగా తను అర్థం చేసుకున్న ఈ వివరణను మాతో పంచుకున్న శ్రీ రాజా రెడ్డి గారికి నా ధన్యవాదాలు.
Friday, February 22, 2013

అమ్నాయాక్షి
అమ్నాయాక్షి లేదా అవనాక్షమ్మ (అమ్న + అక్షి = వేదములే కన్నులుగా కలిగినది).

పూర్వము వేదములను అపహరించిన సోమకాశురుని సంహరించుటకు దేవతలు జరిపిన యఙ్న పరిరక్షణ కొరకు బ్రహ్మచే ప్రతిష్టించబడిన శ్రీ  అవనాక్షి లేదా అమ్నాయాక్షి అమ్మవారి దేవాలయం చిత్తూరు జిల్లా లోని తిరుపతికి 40 కీ.మీ. దూరంలో  ఉన్న నారాయణవనం ప్రాంతంలో ఉన్నది.  

ఇక్కడి ప్రజలు ఈవిడని తమ గ్రామ దేవతగా కొలుస్తారు.  ఈ ఆలయం నారాయణవనంలో ప్రవహించే అరుణానదికి దక్షిణం గాను, శ్రీ అగస్థీశ్వర స్వామి ఆలయమునకు పశ్చిమంలోనూ ఉన్నది. నారాయణవనం లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి 2 కీ. మీ. దూరంలో ఉంది. 

బయటకు చాలా చిన్నగా కనిపించే ఈ గుడిలోని అమ్మవారు చాలా మహిమగల తల్లి. సకల జనులను ఈతి బాధలనుండి విముక్తి చేసే జగజ్జనని. 

 అంతే కాదు ఈ గుడికి ఇంకో విశిష్టత కూడా ఉంది.  కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వరుడు , శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న సందర్భం లో ఇక్కడ ఆ దంపతులిద్దరూ గౌరీ వ్రతం చేసుకున్నారు. 

వేంకటాద్రి సమం స్థానం 
  బ్రహ్మాండే నాస్తి కించనః 
వెంకటేశ సమో దేవో 
  న భూతో న భవిష్యతి 

 ఇంతటి మహిమాన్వితుడు, కలియుగ దైవం అయిన శ్రీ శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడి, ఈ గుడిలోని అమ్మవారి సమక్షం లో గౌరీ వ్రతం చేసుకున్నారు. ఎంత పుణ్యక్షేత్రమో కదా ఇది. 

మరి ఇంతటి పుణ్యక్షేత్రాన్ని మనం కూడా దర్శిస్తే బాగుంటుంది కదా.  ఈ  అమ్మవారి కళ్ళలోకి చూస్తే ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. మనస్సు లోని భారమంతా తీరిపోయి ఎంతో హాయిగా  ప్రశాంతం గా ఉంటుంది. (నాకైతే అలానే అనిపించింది మరి) 

ఈసారేప్పుడన్నా తిరుపతికి వచ్చినప్పుడు వీలుచూసుకుని ఈ గుడిని కూడా  తప్పకుండా దర్శించండి. 

ఈ గుడిలో ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి ఉత్సవాలు కుడా ఎంతో ఘనంగా నిర్వహిస్థారు. 

Friday, February 8, 2013

చిదంబర రహస్యం

చిదంబర రహస్యం 
మనం ఈ చిదంబర రహస్యం అన్న మాటను చాలా సార్లు విన్నాము కదా.  మరి దానికి అర్థం ఏమిటిట???  నాకు తెలిసిపోయింది గా ..........

ఆహాహా అంటే నాకు చిదంబర రహస్యం ఏంటో తెలిదు కానీ, చిదంబర రహస్యం అని ఎందుకు అంటారో తెలిసిపోయింది.

 అది తెలుసుకునే ముందు పంచభూత లింగాల గురించి తెలుసుకుందాం.  గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం  వీటిని పంచభూతాలు అంటాం అని అందరికీ తెలిసిందే కదా.  అలానే పంచభూత లింగాలు ఉన్నాయి.  అవి:

1.వాయులింగం, 2. జలలింగం, 3. తేజోలింగం, 4. పృథ్విలింగం మరియు 5. ఆకసలింగం.

మన తిరుపతికి దగ్గరలో శ్రీ కాళహస్తి ఉంది కదా, అక్కడ ఉండే లింగమే వాయు లింగం.  మనం చిన్నప్పుడు సాలెపురుగు, పాము, ఏనుగు వారికి తోచిన విధంగా శివునికి పూజలు చేసి మోక్షం సంపాదించాయి అనే  కథ విన్నాం కదా,  ఆ క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి . ఇక్కడి స్వామి పేరు కాలహస్తీస్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ.

రెండవది జలలింగం.  ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది.  ఇది తమిళనాడు లోని తిరుచిరాపల్లి సమీపంలోని జంబూకేశ్వర క్షేత్రంలో ఉంటుంది.  ఇక్కడి స్వామివారి పేరు జమ్బూకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి.  బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్న పరమేశ్వరుడు దాని నివారణ కోసం జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జమ్బూకేశ్వరుడు అని పేరు వచ్చింది.

మూడవది తేజోలింగం.  ఇది తమిళనాడు లోని అరుణాచల (తిరువన్నామలై ) క్షేత్రంలో ఉంది.  అరుణాచలం శిఖరాగ్రం పై అగ్ని శిఖ ఒకటి ఆవిర్భవించి, తేజోలింగ రూపుడయ్యాడు.  ఇక్కడి శివుని పేరు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అబిదకుచాంబ లేదా ఉన్నమలై అంబ / ఉన్నమలై నాయగి .

ఇక పృథ్విలింగం సంగతేంటంటే ఇది మట్టిలింగం. ఇది తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉంది.  ఈ లింగం పార్వతీదేవిచే ప్రతిష్టింపబడింది. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి కొలువై ఉన్నారు.  ఈ కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.

ఆఖరిది ఆకాశలింగం.  ఇది తమిళనాడులోని చిదంబరం అనే క్షేత్రంలో   ఉంది.  ఈ ఆకాశలింగ దర్శనం చాలా రహస్యమైనది. ఆకాశం లాగా శూన్యంగా కనిపిస్తుంది.  అస్సలు లింగ దర్శనమే ఉండదు.  ఈ క్షేత్రంలో నటరాజస్వామి,  శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. (అందుకే చిదంబర రహస్యం అని అంటారు)

మరి అంతటి రహస్యమైన ఈ ఆకాశలింగాన్ని దర్శించాలంటే మనం ఎంతటి తపోనిష్ఠులం అవ్వాలో కదా.  ఎంతో సాధన చేయాలి.


Saturday, February 2, 2013

కావేరీ పాక౦
కావేరీ పాక౦ అని ఒక గ్రామ౦ ఉ౦ది. క౦చి ను౦డి వేలూరు వెళ్ళే దారికి ఇది ఇరువది మైళ్ళ దవ్వులో ఉన్నది. అచటికి 2 మైళ్ళ దవ్వులో పాలార్ నది ప్రవహిస్తూ ఉ౦టు౦ది. దాని ఒడ్డున ’తిరుప్పార్ కడల్’ అనేది ఒక క్షేత్ర౦. ఆ క్షేత్ర౦లో ఒక పెరుమాళ్ళగుడి. ఆ దేవళము గూర్చి ఒక కథ వాడుకలో ఉన్నది.

ఆ ఊళ్ళో మొదట విష్ణ్వాలయ౦ అనేది లేదు. శివుని గుడి మాత్ర౦ ఉ౦డేది. శ్రీవైష్ణవులొకరు బహుక్షేత్రాటన౦ చేసి ఆ ఊరు వచ్చారు. అన్ని ఊళ్ళలోనూ శివ విష్ణుదేవాలయాలు ఉ౦టాయి. ఆయన ఏఊరు వెళ్ళినా విష్ణుదర్శన౦ లేకు౦డా భుజి౦చి ఎరుగరు. ఎన్ని నాళ్ళు వరుసగా విష్ణు దర్శన భాగ్య౦ లేకున్నా అన్ని నాళ్ళూ ఆయనకు ఉపవాసమే. ఆయన తిరుప్పార్ కడల్ అనే గ్రామ౦ వే౦చేసి విష్ణ్వాలయ౦ కోస౦ వెతకడ౦ మొదలుపెట్టాడు. కానీ చూచిన గుడులన్నీ శివునివే. ఇ౦దులో ఈ గుడిలోనయినా విష్ణువు ఉ౦టాడేమో అని దానిలో దూరాడు. చూచును గదా ఎట్టెదుట ఈశ్వరుడు. వె౦టవె౦టనే బితుకు బితుకుమ౦టూ బయటికి పరుగుతీశాడు. ఆనాడిక దైవదర్శన౦లేదని అనుకొని ఒక పెడ ఆకలితోనూ ఒక పెడ బె౦గతోనూ తల్లడిల్లుతూ కూచున్నాడు. భక్తితోడి బాధ దుర్భర౦గా ఉ౦ది. అతని ఆస్థితి చూచి శ్రీమహావిష్ణువి వృధ్ధ బ్రాహ్మణవేష౦లో వచ్చి ’స్వామీ! విష్ణుదర్శనానికి వస్తారా’ అని అడిగారుట.

"ఈ వూళ్ళో విష్ణ్వాలయ౦ కూడానా? పాడూరు" అని కసురుకున్నాడట.

’అల్లదిగో ఆ కనపడేది పెరుమాళ్ళ కోవెలగదా!’ అన్నాడట బ్రాహ్మణుడు. ఆ భక్తుడిప్పుడు చూచి బెదిరి పారిపోయి వచ్చి౦ది ఆ కోవెల ను౦డే - ఎ౦దుకయ్యా అబధ్ధాలు? అది ఈశ్వరుని గుడి’ అని అన్నాడు.

’కాదు అబధ్ధ౦ చెప్పేది మీరు. అది పెరుమాళ్ళు గుడే. కావలిస్తే వచ్చి చూచుకో౦డి’ అని బ్రాహ్మణుడు అన్నాడు. ఇట్లాకాదని భక్తుడూ, ఔనని ముసలిబాపడూ వాదులాడారు. మాధ్యస్థ్యానికి కొ౦దరు బ్రాహ్మణులు పోగయారు. ఇదేమిటో ’మన అ౦దర౦ కలిసివెళ్ళి చూచివత్తా౦’ అని అనుకున్నారు.

అక్కడికి వెళ్ళి చూడగా ఆలయమేమో శివాలయమే. మూర్తి శివలి౦గమువలెనే, క్రి౦ద బ్రహ్మపీఠ౦. కాని దానిమీద మాత్ర౦ పెరుమాళ్ళు. దానిని చూడగానే ’ఏమారిపోతిమే! మహావిష్ణువు కదా ఇచట ఉ౦డేది’ అని క్షేత్రాటన౦మాని ఆ ఊళ్ళోనే కాపుర౦ పెట్టి పెరుమాళ్ళ సేవచేస్తూ ఉ౦డిపోయారుట!

నేటికిన్నీ ఆ క్షేత్ర౦లో బ్రహ్మపీఠమ్మీద లి౦గ౦ ఉ౦డే చోట పెరుమాళ్ళ విగ్రహ౦ ఉ౦టు౦ది. శివకేశవుల ఏకత్వానికి ఈ క్షేత్ర౦ ఒక దృష్టా౦త౦. శ౦కరనాయనార్ కోవెలలోగూడా ఒకేశరీర౦తో శ౦కరనారాయణులిరువురూ ఉన్నారు.

శ౦కరనారాయణ స్వరూప౦ శివవిష్ణువుల అబేధములు తెలుపుతు౦ది. అబేధమైన వస్తువు బేధమ్ కలిగిన దానివలె రె౦డుమూడు రూపాలు దాల్చి మనకు అనుగ్రహము చేస్తున్నదని శాస్త్రాలవలనను క్షేత్రాలలోని మూర్తులవలననూ తెలిసికొనవచ్చు. రత్నత్రయ పరీక్ష అనే గ్ర౦థ౦లో రత్నములను గురి౦చి చెప్పేటప్పుడు ’ఒకేస్వరూప౦ ద్వివిధ౦గానూ త్రివిధ౦గానూ ప్రకాశిస్తు౦దనిన్నీ, ఏయే పని యేయే ప్రయోజనానికి ఏయే విధముగా భాసి౦చవలెనో ఆయా విధ౦గా భాసిస్తు౦దనిన్నీ, నానా రూపాలతో వేరు వేరు స్థితులున్నటులుగా తోచినా, అభిన్నమైన వస్తువిది, అని చెప్పబడినది. దీనిని మనము తెలుసుకొని ఆ పరమాత్మానుగ్రహ౦ పొ౦దాలి.

[Courtesy Smt.Aruna Rekha garu]             
{Shared from Face Book} 
 [ఎంటండి అందరూ ఈ ఆఖరి లైను చదవగానే అలా అయిపోయారు??? ఎక్కడి నుండో కొట్టుకొచ్చిన పోస్ట్ పెట్టననా?  ఆవిడ అనుమతి తీసుకునే పెట్టానులెండి.]
కావేరీ పాక౦ అని ఒక గ్రామ౦ ఉ౦ది. క౦చి ను౦డి వేలూరు వెళ్ళే దారికి ఇది ఇరువది మైళ్ళ దవ్వులో ఉన్నది. అచటికి 2 మైళ్ళ దవ్వులో పాలార్ నది ప్రవహిస్తూ ఉ౦టు౦ది. దాని ఒడ్డున ’తిరుప్పార్ కడల్’ అనేది ఒక క్షేత్ర౦. ఆ క్షేత్ర౦లో ఒక పెరుమాళ్ళగుడి. ఆ దేవళము గూర్చి ఒక కథ వాడుకలో ఉన్నది.

ఆ ఊళ్ళో మొదట విష్ణ్వాలయ౦ అనేది లేదు. శివుని గుడి మాత్ర౦ ఉ౦డేది. శ్రీవైష్ణవులొకరు బహుక్షేత్రాటన౦ చేసి ఆ ఊరు వచ్చారు. అన్ని ఊళ్ళలోనూ శివ విష్ణుదేవాలయాలు ఉ౦టాయి. ఆయన ఏఊరు వెళ్ళినా విష్ణుదర్శన౦ లేకు౦డా భుజి౦చి ఎరుగరు. ఎన్ని నాళ్ళు వరుసగా విష్ణు దర్శన భాగ్య౦ లేకున్నా అన్ని నాళ్ళూ ఆయనకు ఉపవాసమే. ఆయన తిరుప్పార్ కడల్ అనే గ్రామ౦ వే౦చేసి విష్ణ్వాలయ౦ కోస౦ వెతకడ౦ మొదలుపెట్టాడు. కానీ చూచిన గుడులన్నీ శివునివే. ఇ౦దులో ఈ గుడిలోనయినా విష్ణువు ఉ౦టాడేమో అని దానిలో దూరాడు. చూచును గదా ఎట్టెదుట ఈశ్వరుడు. వె౦టవె౦టనే బితుకు బితుకుమ౦టూ బయటికి పరుగుతీశాడు. ఆనాడిక దైవదర్శన౦లేదని అనుకొని ఒక పెడ ఆకలితోనూ ఒక పెడ బె౦గతోనూ తల్లడిల్లుతూ కూచున్నాడు. భక్తితోడి బాధ దుర్భర౦గా ఉ౦ది. అతని ఆస్థితి చూచి శ్రీమహావిష్ణువి వృధ్ధ బ్రాహ్మణవేష౦లో వచ్చి ’స్వామీ! విష్ణుదర్శనానికి వస్తారా’ అని అడిగారుట.

"ఈ వూళ్ళో విష్ణ్వాలయ౦ కూడానా? పాడూరు" అని కసురుకున్నాడట.

’అల్లదిగో ఆ కనపడేది పెరుమాళ్ళ కోవెలగదా!’ అన్నాడట బ్రాహ్మణుడు. ఆ భక్తుడిప్పుడు చూచి బెదిరి పారిపోయి వచ్చి౦ది ఆ కోవెల ను౦డే - ఎ౦దుకయ్యా అబధ్ధాలు? అది ఈశ్వరుని గుడి’ అని అన్నాడు.

’కాదు అబధ్ధ౦ చెప్పేది మీరు. అది పెరుమాళ్ళు గుడే. కావలిస్తే వచ్చి చూచుకో౦డి’ అని బ్రాహ్మణుడు అన్నాడు. ఇట్లాకాదని భక్తుడూ, ఔనని ముసలిబాపడూ వాదులాడారు. మాధ్యస్థ్యానికి కొ౦దరు బ్రాహ్మణులు పోగయారు. ఇదేమిటో ’మన అ౦దర౦ కలిసివెళ్ళి చూచివత్తా౦’ అని అనుకున్నారు.

అక్కడికి వెళ్ళి చూడగా ఆలయమేమో శివాలయమే. మూర్తి శివలి౦గమువలెనే, క్రి౦ద బ్రహ్మపీఠ౦. కాని దానిమీద మాత్ర౦ పెరుమాళ్ళు. దానిని చూడగానే ’ఏమారిపోతిమే! మహావిష్ణువు కదా ఇచట ఉ౦డేది’ అని క్షేత్రాటన౦మాని ఆ ఊళ్ళోనే కాపుర౦ పెట్టి పెరుమాళ్ళ సేవచేస్తూ ఉ౦డిపోయారుట!

నేటికిన్నీ ఆ క్షేత్ర౦లో బ్రహ్మపీఠమ్మీద లి౦గ౦ ఉ౦డే చోట పెరుమాళ్ళ విగ్రహ౦ ఉ౦టు౦ది. శివకేశవుల ఏకత్వానికి ఈ క్షేత్ర౦ ఒక దృష్టా౦త౦. శ౦కరనాయనార్ కోవెలలోగూడా ఒకేశరీర౦తో శ౦కరనారాయణులిరువురూ ఉన్నారు.

శ౦కరనారాయణ స్వరూప౦ శివవిష్ణువుల అబేధములు తెలుపుతు౦ది. అబేధమైన వస్తువు బేధమ్ కలిగిన దానివలె రె౦డుమూడు రూపాలు దాల్చి మనకు అనుగ్రహము చేస్తున్నదని శాస్త్రాలవలనను క్షేత్రాలలోని మూర్తులవలననూ తెలిసికొనవచ్చు. రత్నత్రయ పరీక్ష అనే గ్ర౦థ౦లో రత్నములను గురి౦చి చెప్పేటప్పుడు ’ఒకేస్వరూప౦ ద్వివిధ౦గానూ త్రివిధ౦గానూ ప్రకాశిస్తు౦దనిన్నీ, ఏయే పని యేయే ప్రయోజనానికి ఏయే విధముగా భాసి౦చవలెనో ఆయా విధ౦గా భాసిస్తు౦దనిన్నీ, నానా రూపాలతో వేరు వేరు స్థితులున్నటులుగా తోచినా, అభిన్నమైన వస్తువిది, అని చెప్పబడినది. దీనిని మనము తెలుసుకొని ఆ పరమాత్మానుగ్రహ౦ పొ౦దాలి.

Sunday, January 27, 2013

నారాయణ వనం !

నారాయణ వనం !  ఈ పేరు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా !  అయినా పర్లేదు, నేను చెప్పేది కూడా ఒకసారి వినేసేయండి. అబ్బా .... అదేనండి చదివేసేయండి.

తిరుపతికి 30 కి.మీ. దూరంలో ఉంది ఈ ఊరు. అప్పట్లో ఈ ఊరిని శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి గారైన ఆకాశ రాజు పరిపాలించే వారు.  తిరుమల కొండ మీద బస చేసిన స్వామివారు ఒకనాడు ఒక ఏనుగును వేటాడుతూ ఇక్కడికి వచ్చారు.  అప్పుడే అమ్మవారిని చూసారు. తన తల్లిగారైన వకుళమాత ద్వారా ఆకాశ రాజుని సంప్రదించి అమ్మవారిని వివాహమాడారు.  శ్రీ స్వామివారు, అమ్మవార్ల కళ్యాణం జరిగిన ప్రదేశమే ఈ నారాయణవనం.  ఇక్కడి సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామివారు కళ్యాణ వేంకటేశ్వరునిగా వెలసి, భక్తులను దీవిస్తున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వారందరూ వీలు చూసుకుని తప్పకుండా ఈ గుడిని దర్శించండి.  ఈ ఆలయ ప్రాంగణం సువిశాలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి మూల విరాట్టు కుడి చేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమ చేతిలో వేట ఖడ్గం ధరించి ఉంటారు.  ప్రాంగణం లోపల పద్మం లో కుర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.

 అంతే కాదండి ఇక్కడ మీరు అమ్మవారి కళ్యాణ సమయంలో నలుగు పిండి విసిరిన తిరగలిని కూడా  చూడొచ్చు. ఎంత పెద్దగా ఉంటుందో.

పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు, లేదా వారి తల్లిదండ్రులు ఇక్కడి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రార్ధిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుంది అని ప్రతీతి.      (Please note this point your Honour)

నారాయణవనం లోనే  అవనాక్షమ్మ గుడి కూడా ఉంది. ఈవిడ శ్రీ పద్మావతి అమ్మవారి కుల దైవం. చాలా మహిమగల తల్లి. ఈ గుడి గురించి తరువాత చెప్తాను.

అందరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.

Monday, January 7, 2013

అనుబంధం


మూడు ముళ్ళ బంధం,
     ముచ్చటైన బంధం 

ఏడడుగుల బంధం,
     ఏడు జన్మల బంధం 

వేద మంత్రాల తోడుగా,

     అగ్నియే  సాక్షిగా,
ఒక్కటైనదీ బంధం.

తోడూ నీడగా 

   నీడే తానుగా 
తానే నీవుగా 
   నిలచినదీ బంధం.

నీవు నేనన్నది 

   తెలియనిదీ బంధం,
నీవే నేనై నిలచిన 
    ఆలోచనా తరంగం.

పంచ భూతాలెదురైన 

  చెదిరిపోనిదీ బంధం.

ఈ జన్మలోనే కాదు,

ఏడేడు జన్మలకు 
తోడై నిలుచును ఈ బంధం.Tuesday, January 1, 2013

స్వాగతిద్దాం


ఇలా వస్తావు, అలా వేల్లిపోతావు.
నువ్వు వచ్చావు అని ఆనందించే లోపే
ఇక సెలవు అంటావు.
నిన్ను అట్టిపెట్టుకోవాలని
నేనెంత ప్రయత్నించినా,
నాకు చిక్కకుండా పారిపోతావు.

ఎన్నో, ఎన్నెన్నో ఆశల్ని కలిగిస్తావు,
ఎందఱో ఆప్తుల్ని అందిస్తావు,
మిత్రుల మధ్య కుడా వైరం పెట్టి
వినోదం చూస్తావు.
అసలేమిటి నీ వైనం?

సంతోషాన్ని ఇచ్చేది నువ్వే,
ధుఖ సాగరం లో ముంచెదీ నువ్వే
మదిలో ఆశలు రేకెత్తించేది నీవే,
నైరాశ్యం లోకి నేట్టేది నీవే
కానీ జీవితాన్ని జీవిన్చడానికి ఎన్నో
పాఠాలు నేర్పుతావు

కాలమా..........,

నీవే నా ఆప్తుడివి, గురువువి,
స్నేహితుడివి, విరొధివి కూడా నువ్వే.

తల్లి, తండ్రి, గురువు,
అక్క, చెల్లి, తమ్ముడు, అన్న,
మిత్రులు, అందరూ
నీతోనే ముడిపడి ఉన్నారు.

నీ ఈ పయనం లో ఒక సంవత్సరం
గతం లోకి జారుకుంది.
అయినా సరే, నేనున్నానంటూ
సరికొత్త సంవత్సరం ...........

కొత్త హంగులతో, ఆశలతో, ఊహలతో,
స్పూర్తులతో, కళ్ళ ముందు నిలిచింది.

నువ్వు మాకోసం ఏమేమి దాచి ఉంచినా,
మేము మాత్రం నీవు మాకందిన్చాబోయే
ప్రతి పాఠాన్ని మాకు అనుకూలంగా మలచుకోగలం
అన్న నమ్మకం తో, ఆత్మవిశ్వాసంతో
కొత్త సంవత్సరాన్ని సాదరంగా స్వాగతిస్తున్నాం.


[అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు]