Friday, January 15, 2010

నాతూ వాతలు తావాలి.......వా :(((((((((((((


"వాతలు"...ఇవంటే నాకు చిన్నప్పుడు ఎంత ఇష్టమో!...అడిగి మరీ వాతలు పెట్టించుకునేదాన్ని. ఏ రోజైనా వాతలు లేకపోతే ఇంట్లో మూడో ప్రపంచయుద్ధం సృష్టించేదాన్నట. ఇంతకీ అసలు సంగతేంటంటే...అది నాకు మాటలు కూడా సరిగ్గా రాని వయసు. మా నాన్నారు రోజూ ఆఫీసు నుంచి రాత్రి ఇంటికొస్తూ నాకోసం పాలకోవా తీసుకొచ్చేవారు. ఆయన రావడం ఎంత లేటయినా వెయిట్ చేసి మరీ అవి తీసుకుని తింటే గానే నిద్రపోయేదాన్ని కాదట. ఒకరోజు అలాగే మా నాన్న తెచ్చిన పాలకోవా తింటూ అరుగుమీద కూర్చుని ఉండగా ఎదురింటి అక్క ఏం తింటున్నవ్ అని అడిగింది. నాకేమో దాని పేరు కూడా తెలియదు...అందుకనే చేతిలో పాలకోవా బిళ్ళ చూపించి "ఇది తిన్తుతున్నా" అని చెప్పాను. అప్పుడు ఆ నన్ను ఏడిపించడానికి "దాన్ని వాతలు అంటారు...ఇక నుంచి ఎవరయినా అడిగితే అలానే చెప్పు అంది" నాకేం తెలుసు కామోసు అనుకున్నా. ఇహ చూస్కోండి అక్కడనుంచి రోజూ మా నాన్న రాగానే నాన్న వాతలు తీచుకోచ్చావా? అని అడగడం ఇంట్లో వాళ్ళు నవ్వుకోడం మామూలయిపోయింది. 

ఒక రోజు మా నాన్న రోజూలా రాత్రి కాక సాయంత్రమే ఇంటికొచ్చి రాత్రి ఇంటికి గెస్ట్ లు వస్తున్నారు. శనివారమే కదా టిఫిన్ చేసేయి అని మా అమ్మతో చెప్పి బజారుకి వెళ్ళారు. అక్కడే ఉన్న నాకు పే....ద్ద అవమానం జరిగినట్టు అనిపించింది. ఆఫీసు నుంచి వచ్చిన నాన్న "వాతలు" తీసుకురాకుండా రావడం నాకు నచ్చలేదు. ఇంక చూస్కోండి ఆరున్నొక్క రాగం లో నా నిరసన తెలియజేస్తూ మా అమ్మ దగ్గరికి వెళ్లి "అమ్మా.. నాన్న నాతు వాతలు తేలేదు. నాతు వాతలు తావాలి....' అని మొదలు పెట్టాను. మా అమ్మేమో ఒక పక్క అతిథులోస్తున్నారని చపాతీలు చేస్తూ బిజీగా ఉంటే పక్కనుంచి నా గోల ఒకటి. ఒకటి రెండు సార్లు చెప్పి చూసింది.. ఊహు నేను వింటేనా "నాతు వాతలు తావాలీ..." అంటూ ఒకటే ఏడుపు. విసిగిపోయిందా అమ్మ చేతిలో అట్లకాడ చూపించి వాతలు కావాలా? అని కోపంగా చూపించింది. అదే సమయంలో నేను అమ్మ చేయ్యిలాగడం ఆ అట్లకాడ నా చేతికి తగిలి "నిజం వాత" పడటం జరిగిపోయాయి. ఇంక చూసుకోండి...మా వీధి మొత్తం వినబడేలా ఏడుపు మొదలెట్టేసాను. నా హడావుడికి ఎదురింట్లో ఉండే మామ్మగారు, అత్తయ్యలు, అక్కలు అంతా వచ్చ్చేసారు. వీధి వీధంతా ఏం జరిగిందో అని మా ఇంటిముందే...అప్పుడే బజారు నించి వస్తూ దార్లో కనబడ్డ గెస్టు లతో ఇంటికి చేరుకున్న మా నాన్నకు ఈ హడావుడి ఏమి అర్ధం కాలేదు. ఇంతలో నన్ను ఎత్తుకుని సముదాయిస్తున్న ఎదురింటి మామ్మగారు మా నాన్నతో ఫిర్యాదు చేస్తున్నా స్టైల్ లో "చూడు చిన్నపిల్ల తెలియక అడిగితే ఎలా వాత  పెట్టిందో.."అనగానే అంత సేపూ ఏడుస్తున్న నేను సడెన్గా ఏడుపు ఆపి "ఎక్కల పెట్టిందీ? నాతు వాతలు పెట్టలేదు ...నాతు వాతలు తావాలి...." అంటూ మళ్లీ మొదలెట్టాను. ఒక్కసారిగా అంతా నవ్వడం మొదలుపెట్టారు...నాకేమో వాళ్ళెందుకు నవ్వుతున్నారో తెలియదు...ఇంతలో మానాన్న బజారు నించి తెచ్చిన పాలకోవా నా చేతికి ఇవ్వడంతో  నేను మామ్మగారి చేతుల్లోంచి ఒక్కసారిగా కిందకి దూకినంత పనిచేసి మా నాన్న చేతుల్లో ఉన్న ప్యాకెట్ మొత్తం లాక్కుని "అన్ని వాతలూ నాతే తావాలి" అనడం తో నా చుట్టూ ఉన్న పెద్దాల్లందరూ మళ్లీ నవ్వడం మొదలెట్టారు. ఎవరు నవ్వితే నాకేంటి నా వాతలు నాకు దొరికాయి అనుకుంటూ నేనూ హేప్పీసు.!!

అదండీ నా వాతల ప్రహసనం.  

11 comments:

 1. చాలా బాగుంది మీ వాతల పర్వం.

  ReplyDelete
 2. మీ వాతలు చాలా బాగున్నాయి . వాతలు మీకు మాత్రమేనా ? మాకందరికీ కూడా పెడతారా ?
  చాలా బాగుంది. హాయిగా నవ్వు కున్నాము.

  http://madhav-voohalapallaki.blogspot.com/

  ReplyDelete
 3. బ్లాగులో మొదటి పోష్టు చేసిన సందర్భంగా "మాతూ కుంచెం వాతలు పెత్తంది మలీ......"

  ReplyDelete
 4. హ హ హ బాగుంది :-)

  ReplyDelete
 5. హహ! మాతూ వాతలు కావాలి .....

  ReplyDelete
 6. bavundi me vathala program.. :)

  ReplyDelete