అమ్నాయాక్షి లేదా అవనాక్షమ్మ (అమ్న + అక్షి = వేదములే కన్నులుగా కలిగినది).
పూర్వము వేదములను అపహరించిన సోమకాశురుని సంహరించుటకు దేవతలు జరిపిన యఙ్న పరిరక్షణ కొరకు బ్రహ్మచే ప్రతిష్టించబడిన శ్రీ అవనాక్షి లేదా అమ్నాయాక్షి అమ్మవారి దేవాలయం చిత్తూరు జిల్లా లోని తిరుపతికి 40 కీ.మీ. దూరంలో ఉన్న నారాయణవనం ప్రాంతంలో ఉన్నది.
ఇక్కడి ప్రజలు ఈవిడని తమ గ్రామ దేవతగా కొలుస్తారు. ఈ ఆలయం నారాయణవనంలో ప్రవహించే అరుణానదికి దక్షిణం గాను, శ్రీ అగస్థీశ్వర స్వామి ఆలయమునకు పశ్చిమంలోనూ ఉన్నది. నారాయణవనం లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి 2 కీ. మీ. దూరంలో ఉంది.
బయటకు చాలా చిన్నగా కనిపించే ఈ గుడిలోని అమ్మవారు చాలా మహిమగల తల్లి. సకల జనులను ఈతి బాధలనుండి విముక్తి చేసే జగజ్జనని.
అంతే కాదు ఈ గుడికి ఇంకో విశిష్టత కూడా ఉంది. కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వరుడు , శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న సందర్భం లో ఇక్కడ ఆ దంపతులిద్దరూ గౌరీ వ్రతం చేసుకున్నారు.
వేంకటాద్రి సమం స్థానం
బ్రహ్మాండే నాస్తి కించనః
వెంకటేశ సమో దేవో
న భూతో న భవిష్యతి
ఇంతటి మహిమాన్వితుడు, కలియుగ దైవం అయిన శ్రీ శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడి, ఈ గుడిలోని అమ్మవారి సమక్షం లో గౌరీ వ్రతం చేసుకున్నారు. ఎంత పుణ్యక్షేత్రమో కదా ఇది.
మరి ఇంతటి పుణ్యక్షేత్రాన్ని మనం కూడా దర్శిస్తే బాగుంటుంది కదా. ఈ అమ్మవారి కళ్ళలోకి చూస్తే ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. మనస్సు లోని భారమంతా తీరిపోయి ఎంతో హాయిగా ప్రశాంతం గా ఉంటుంది. (నాకైతే అలానే అనిపించింది మరి)
ఈసారేప్పుడన్నా తిరుపతికి వచ్చినప్పుడు వీలుచూసుకుని ఈ గుడిని కూడా తప్పకుండా దర్శించండి.
ఈ గుడిలో ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి ఉత్సవాలు కుడా ఎంతో ఘనంగా నిర్వహిస్థారు.