Friday, February 8, 2013

చిదంబర రహస్యం

చిదంబర రహస్యం 
మనం ఈ చిదంబర రహస్యం అన్న మాటను చాలా సార్లు విన్నాము కదా.  మరి దానికి అర్థం ఏమిటిట???  నాకు తెలిసిపోయింది గా ..........

ఆహాహా అంటే నాకు చిదంబర రహస్యం ఏంటో తెలిదు కానీ, చిదంబర రహస్యం అని ఎందుకు అంటారో తెలిసిపోయింది.

 అది తెలుసుకునే ముందు పంచభూత లింగాల గురించి తెలుసుకుందాం.  గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం  వీటిని పంచభూతాలు అంటాం అని అందరికీ తెలిసిందే కదా.  అలానే పంచభూత లింగాలు ఉన్నాయి.  అవి:

1.వాయులింగం, 2. జలలింగం, 3. తేజోలింగం, 4. పృథ్విలింగం మరియు 5. ఆకసలింగం.

మన తిరుపతికి దగ్గరలో శ్రీ కాళహస్తి ఉంది కదా, అక్కడ ఉండే లింగమే వాయు లింగం.  మనం చిన్నప్పుడు సాలెపురుగు, పాము, ఏనుగు వారికి తోచిన విధంగా శివునికి పూజలు చేసి మోక్షం సంపాదించాయి అనే  కథ విన్నాం కదా,  ఆ క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి . ఇక్కడి స్వామి పేరు కాలహస్తీస్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ.

రెండవది జలలింగం.  ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది.  ఇది తమిళనాడు లోని తిరుచిరాపల్లి సమీపంలోని జంబూకేశ్వర క్షేత్రంలో ఉంటుంది.  ఇక్కడి స్వామివారి పేరు జమ్బూకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి.  బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్న పరమేశ్వరుడు దాని నివారణ కోసం జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జమ్బూకేశ్వరుడు అని పేరు వచ్చింది.

మూడవది తేజోలింగం.  ఇది తమిళనాడు లోని అరుణాచల (తిరువన్నామలై ) క్షేత్రంలో ఉంది.  అరుణాచలం శిఖరాగ్రం పై అగ్ని శిఖ ఒకటి ఆవిర్భవించి, తేజోలింగ రూపుడయ్యాడు.  ఇక్కడి శివుని పేరు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అబిదకుచాంబ లేదా ఉన్నమలై అంబ / ఉన్నమలై నాయగి .

ఇక పృథ్విలింగం సంగతేంటంటే ఇది మట్టిలింగం. ఇది తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉంది.  ఈ లింగం పార్వతీదేవిచే ప్రతిష్టింపబడింది. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి కొలువై ఉన్నారు.  ఈ కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.

ఆఖరిది ఆకాశలింగం.  ఇది తమిళనాడులోని చిదంబరం అనే క్షేత్రంలో   ఉంది.  ఈ ఆకాశలింగ దర్శనం చాలా రహస్యమైనది. ఆకాశం లాగా శూన్యంగా కనిపిస్తుంది.  అస్సలు లింగ దర్శనమే ఉండదు.  ఈ క్షేత్రంలో నటరాజస్వామి,  శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. (అందుకే చిదంబర రహస్యం అని అంటారు)

మరి అంతటి రహస్యమైన ఈ ఆకాశలింగాన్ని దర్శించాలంటే మనం ఎంతటి తపోనిష్ఠులం అవ్వాలో కదా.  ఎంతో సాధన చేయాలి.


7 comments:

  1. అరుణాచలంలోని అమ్మవారి పేరు ‘అరుణాచలేశ్వరి’ కాదు, ‘అపీత కుచాంబ’ ! గమనించండి. --శ్రీధర్.ఎ

    ReplyDelete
  2. manchi vishayaalu panchukuntunnaavu swati.good

    ReplyDelete
  3. ఏవో మా లాగా కవితలనో,కథలనో కాకుండా అందరికీ పనికొచ్చేలాగా మీరు చెప్పే విషయాలూ, విశేషాలూ చాలా బాగున్నాయి స్వాతిగారూ.మీకు చెప్పాలనిపించిందంతా చెప్పండి ఖచ్చితంగా మంచి విషయాలే చెపుతారన్న నమ్మకం మాకుంది కాబట్టి వినటానికి మేమెప్పుడూ సిద్దమే.

    ReplyDelete
  4. Swathi garu naaku theluanichalla sanghathulu mee dwara maaku thelusunnadhi thanks

    ReplyDelete