Sunday, January 27, 2013

నారాయణ వనం !

నారాయణ వనం !  ఈ పేరు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా !  అయినా పర్లేదు, నేను చెప్పేది కూడా ఒకసారి వినేసేయండి. అబ్బా .... అదేనండి చదివేసేయండి.

తిరుపతికి 30 కి.మీ. దూరంలో ఉంది ఈ ఊరు. అప్పట్లో ఈ ఊరిని శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి గారైన ఆకాశ రాజు పరిపాలించే వారు.  తిరుమల కొండ మీద బస చేసిన స్వామివారు ఒకనాడు ఒక ఏనుగును వేటాడుతూ ఇక్కడికి వచ్చారు.  అప్పుడే అమ్మవారిని చూసారు. తన తల్లిగారైన వకుళమాత ద్వారా ఆకాశ రాజుని సంప్రదించి అమ్మవారిని వివాహమాడారు.  శ్రీ స్వామివారు, అమ్మవార్ల కళ్యాణం జరిగిన ప్రదేశమే ఈ నారాయణవనం.  ఇక్కడి సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామివారు కళ్యాణ వేంకటేశ్వరునిగా వెలసి, భక్తులను దీవిస్తున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వారందరూ వీలు చూసుకుని తప్పకుండా ఈ గుడిని దర్శించండి.  ఈ ఆలయ ప్రాంగణం సువిశాలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి మూల విరాట్టు కుడి చేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమ చేతిలో వేట ఖడ్గం ధరించి ఉంటారు.  ప్రాంగణం లోపల పద్మం లో కుర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.

 అంతే కాదండి ఇక్కడ మీరు అమ్మవారి కళ్యాణ సమయంలో నలుగు పిండి విసిరిన తిరగలిని కూడా  చూడొచ్చు. ఎంత పెద్దగా ఉంటుందో.

పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు, లేదా వారి తల్లిదండ్రులు ఇక్కడి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రార్ధిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుంది అని ప్రతీతి.      (Please note this point your Honour)

నారాయణవనం లోనే  అవనాక్షమ్మ గుడి కూడా ఉంది. ఈవిడ శ్రీ పద్మావతి అమ్మవారి కుల దైవం. చాలా మహిమగల తల్లి. ఈ గుడి గురించి తరువాత చెప్తాను.

అందరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.

Monday, January 7, 2013

అనుబంధం


మూడు ముళ్ళ బంధం,
     ముచ్చటైన బంధం 

ఏడడుగుల బంధం,
     ఏడు జన్మల బంధం 

వేద మంత్రాల తోడుగా,

     అగ్నియే  సాక్షిగా,
ఒక్కటైనదీ బంధం.

తోడూ నీడగా 

   నీడే తానుగా 
తానే నీవుగా 
   నిలచినదీ బంధం.

నీవు నేనన్నది 

   తెలియనిదీ బంధం,
నీవే నేనై నిలచిన 
    ఆలోచనా తరంగం.

పంచ భూతాలెదురైన 

  చెదిరిపోనిదీ బంధం.

ఈ జన్మలోనే కాదు,

ఏడేడు జన్మలకు 
తోడై నిలుచును ఈ బంధం.







Tuesday, January 1, 2013

స్వాగతిద్దాం


ఇలా వస్తావు, అలా వేల్లిపోతావు.
నువ్వు వచ్చావు అని ఆనందించే లోపే
ఇక సెలవు అంటావు.
నిన్ను అట్టిపెట్టుకోవాలని
నేనెంత ప్రయత్నించినా,
నాకు చిక్కకుండా పారిపోతావు.

ఎన్నో, ఎన్నెన్నో ఆశల్ని కలిగిస్తావు,
ఎందఱో ఆప్తుల్ని అందిస్తావు,
మిత్రుల మధ్య కుడా వైరం పెట్టి
వినోదం చూస్తావు.
అసలేమిటి నీ వైనం?

సంతోషాన్ని ఇచ్చేది నువ్వే,
ధుఖ సాగరం లో ముంచెదీ నువ్వే
మదిలో ఆశలు రేకెత్తించేది నీవే,
నైరాశ్యం లోకి నేట్టేది నీవే
కానీ జీవితాన్ని జీవిన్చడానికి ఎన్నో
పాఠాలు నేర్పుతావు

కాలమా..........,

నీవే నా ఆప్తుడివి, గురువువి,
స్నేహితుడివి, విరొధివి కూడా నువ్వే.

తల్లి, తండ్రి, గురువు,
అక్క, చెల్లి, తమ్ముడు, అన్న,
మిత్రులు, అందరూ
నీతోనే ముడిపడి ఉన్నారు.

నీ ఈ పయనం లో ఒక సంవత్సరం
గతం లోకి జారుకుంది.
అయినా సరే, నేనున్నానంటూ
సరికొత్త సంవత్సరం ...........

కొత్త హంగులతో, ఆశలతో, ఊహలతో,
స్పూర్తులతో, కళ్ళ ముందు నిలిచింది.

నువ్వు మాకోసం ఏమేమి దాచి ఉంచినా,
మేము మాత్రం నీవు మాకందిన్చాబోయే
ప్రతి పాఠాన్ని మాకు అనుకూలంగా మలచుకోగలం
అన్న నమ్మకం తో, ఆత్మవిశ్వాసంతో
కొత్త సంవత్సరాన్ని సాదరంగా స్వాగతిస్తున్నాం.


[అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు]